308-Wheeler Truck: ఈ ట్రక్కుకు ఏకంగా 308 చక్రాలు.. చూసేందుకు ఎగబడుతున్న జనం

308-Wheeler Truck: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ అరుదైన, భారీ ట్రక్కు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

CR Reddy
Published on: 26 Sept 2026 7:02 AM IST
308 Wheeler Truck
X

308 Wheeler Truck 

308-Wheeler Truck: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ అరుదైన, భారీ ట్రక్కు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు 200 టన్నుల బరువుగల భారీ బాయిలర్ మెషీన్‌ను (ఓవర్ డైమెన్షన్ కార్గో వెసల్) మోసుకెళ్తున్న 308 చక్రాల డబుల్ ఇంజిన్ ట్రక్కు ఒడిశా నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి యూపీలోని చందోలీ జిల్లా నౌబత్పూర్ సరిహద్దుకు చేరుకుంది. ఈ భారీ వాహనాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి బారులు తీరారు. ఈ ట్రక్కు సుమారు 100 మీటర్ల పొడవు, 10మీటర్ల ఎత్తు, 8మీటర్ల వెడల్పు కలిగి ఉండటంతో సోషల్ మీడియాలోనూ ఇది హాట్ టాపిక్‌గా మారింది.

లక్నో-బలరాంపూర్ ప్లాంట్ కోసం భారీ యంత్రం రవాణా

ఈ భారీ యంత్రాన్ని బెల్జియం నుంచి సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోని ఒడిశాకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లా బలరాంపూర్‌లో నిర్మిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగార ప్లాంట్ కోసం దీన్ని తరలిస్తున్నారు. ఈ భారీ రవాణా కోసం ట్రక్కు ముందు రెండు పైలట్ వాహనాలు, ప్రత్యేక నిపుణుల బృందం ప్రయాణిస్తున్నాయి. దారిలో రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతాలను వెంటనే సర్దుబాటు చేస్తూ ఈ భారీ వాహనాన్ని ముందుకు సాగిస్తున్నారు.గంటకు కేవలం 10 నుంచి 12 కిమీ దూరం మాత్రమే ఈ వాహనం ప్రయాణిస్తుంది.


జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక చర్యలు

308 చక్రాల ఈ భారీ ట్రక్కు ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రంగంలోకి దిగింది. ట్రక్కు సాఫీగా వెళ్లేందుకు వీలుగా హైవేపై నౌబత్పూర్ నుంచి కటరియా వరకు అడ్డుగా ఉన్న సైనేజ్‌లు, ట్రాఫిక్ బోర్డులు, ప్రవేశ ద్వారాల బోర్డులను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. పోలీసులు, మైనింగ్, వాణిజ్య పన్ను శాఖ అధికారుల సమక్షంలో ఈ వాహనాన్ని అత్యంత జాగ్రత్తగా తదుపరి ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భవిష్యత్ ప్రయాణం, కట్టుదిట్టమైన భద్రత

చందోలీలో ఒక రోజు నిలిపివేసిన తర్వాత ఈ భారీ ట్రక్కు వారణాసి మీదుగా హర్హువా ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజు నిలిపివేసి నిపుణుల పర్యవేక్షణలో ముందుకు సాగనున్నారు. ఈ భారీ ట్రక్కు రాక సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జిల్లా, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారీ పరిమాణం కారణంగా ఈ యంత్రం ప్రయాణించే మార్గంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.