Manipur: మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 15 మంది దుర్మరణం

CR Reddy
Published on: 21 Nov 2026 7:56 AM IST
Manipur
X

Manipur

Manipur: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో కల్తీ మద్యం పెను విషాదాన్ని నింపింది. చక్‌పికరోంగ్ సబ్‌డివిజన్ పరిసర ప్రాంతాల్లో విషపూరిత మద్యం తాగిన 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఇంఫాల్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కల్తీ మద్యం తయారీ, అమ్మకాలపై పోలీసులు కఠిన చర్యలు మొదలుపెట్టారు.

ఆసుపత్రుల్లో సీఎం పర్యటన

ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆయన లాంఫెల్‌పాట్‌లోని షిజా ఆసుపత్రిని, సజీవాలోని బబీనా ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత సీఎం ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. షిజా ఆసుపత్రిలో 140 మందికి పైగా, బబీనా ఆసుపత్రిలో 41 మందికి పైగా బాధితులు చేరినట్లు తెలిపారు. వైద్యుల కఠిన పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

దోషులకు కఠిన శిక్ష తప్పదు

బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చందేల్ జిల్లాలో క్షేత్రస్థాయిలో వైద్య సహాయాన్ని బలోపేతం చేసేందుకు జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నేతృత్వంలో ప్రత్యేక వైద్య బృందాన్ని అవసరమైన మందులతో అక్కడికి పంపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో ఉన్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కల్తీ మద్యం ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, దీనికి కారణమైన దోషులకు కఠిన శిక్షలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.

కడుపునొప్పి, శ్వాస సమస్యలతో విలవిల

పోలీసుల నివేదిక ప్రకారం బాధితుల్లో ఎక్కువ మంది మధ్యవయస్కులైన పురుషులే ఉన్నారు. కల్తీ మద్యం తాగిన తర్వాత వీరందరికీ తీవ్రమైన కడుపునొప్పి, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ఇంఫాల్‌లోని షిజా, బబీనా ఆసుపత్రులకు తరలివచ్చారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఆసుపత్రులపై పెరిగిన ఒత్తిడి

ఒక్కసారిగా భారీ సంఖ్యలో రోగులు రావడంతో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని షిజా ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చేతన్ ఖుండోంగ్‌బామ్ తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS), జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(JNIMS) అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. కొందరు రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తుండగా, లైఫ్ సపోర్ట్, హీమోడయాలసిస్ అవసరం ఉన్న అత్యంత విషమ స్థితిలోని బాధితులను మాత్రం షిజా ఆసుపత్రిలోనే ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.