మదురై తనిష్క్ నగల దోపిడీ కేసులో కీలక మలుపు.. బంగారం, వజ్రాభరణాలు రికవరీ
Madurai Tanishq: తమిళనాడులోని మదురైలో సంచలనం సృష్టించిన తనిష్క్ నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.
మదురై తనిష్క్ నగల దోపిడీ కేసులో కీలక మలుపు.. బంగారం, వజ్రాభరణాలు రికవరీ
Madurai Tanishq Jewellery: తమిళనాడులోని మదురైలో సంచలనం సృష్టించిన తనిష్క్ నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ దోపిడీలో అపహరణకు గురైన రూ.15 కోట్ల విలువైన 11.384 కిలోల బంగారు, వజ్రాభరణాలను పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు నిషాంత్‌తో పాటు అతని తండ్రి సురేష్, స్నేహితురాలు మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందకు పైగా సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రత్యేక పోలీసు బృందం నిందితుల ఆటకట్టించింది.
అసలు దోపిడీ జరిగిందిలా.. పక్కా ప్లాన్‌తో రంగంలోకి నిషాంత్!
తొలుత ఈ దోపిడీలో 15 నుంచి 18 కిలోల వరకు బంగారం చోరీకి గురైందని భావించినప్పటికీ, షోరూమ్ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాక మొత్తం 11.384 కిలోల నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారణ అయింది. దోపిడీకి రెండు రోజుల ముందు నుంచే నిషాంత్ ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. దోపిడీ సమయంలో ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ కెమెరాలపై పెయింట్ లాంటి పదార్థాన్ని స్ప్రే చేసి కప్పివేసినట్లు విచారణలో తేలింది. ప్రాథమిక అంచనా ప్రకారం నిషాంత్ ఒక్కడే ప్రత్యక్షంగా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నేరంలో తండ్రి, స్నేహితురాలి పాత్ర
దోపిడీ చేసిన అనంతరం నిషాంత్ ఆ నగల బ్యాగును తన తండ్రి సురేష్‌కు అందించినట్లు దర్యాప్తులో బయటపడింది. అలాగే నిషాంత్ చేసిన ఈ నేరం గురించి తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినందుకు అతని స్నేహితురాలు మీనాక్షిని కూడా పోలీసులు నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేశారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించారు.
యూట్యూబ్ చూసి నేర్చుకున్నాడా?.. పోలీస్ కస్టడీలో మరిన్ని వివరాలు
దోపిడీకి ఉపయోగించిన పనిముట్లు ఇంకా పూర్తిస్థాయిలో లభ్యం కావాల్సి ఉన్నందున, అరెస్ట్ చేసిన ముగ్గురినీ పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు. దోపిడీ చేసే పద్ధతులను నిషాంత్ యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్నాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా, ఘటన తర్వాత అతను బెంగళూరు, సేలం ప్రాంతాలకు ఎందుకు వెళ్లాడు, అక్కడ ఎవరైనా సహకరించారా అన్న విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
షోరూమ్ భద్రతా లోపాలపై కమిషనర్ అసంతృప్తి
ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ మదురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చోరీకి గురైన మొత్తం సొత్తును రికవరీ చేశామని, అయితే ఈ ఘటనలో ఇతరుల ప్రమేయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాతే పూర్తి వివరాలు బయటపడతాయని తెలిపారు. ఇదే సమయంలో, అంత పెద్ద నగల దుకాణంలో దోపిడీ జరుగుతున్నప్పుడు అలారం పనిచేయకపోవడంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.




