Kunal Ghosh : కునాల్ ఘోష్ కారుపై కోడిగుడ్లు, రాళ్లు.. బెంగాల్‌లో టెన్షన్.!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయం మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు

G Krishna
Published on: 26 Sept 2026 4:18 PM IST
Kunal Ghosh : కునాల్ ఘోష్ కారుపై కోడిగుడ్లు, రాళ్లు.. బెంగాల్‌లో టెన్షన్.!
X

పశ్చిమ బెంగాల్‌ రాజకీయం మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ వాహనంపై శనివారం దుండగులు దాడికి తెగబడ్డారు. హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ర్యాలీకి వెళ్తుండగా అడ్డుగింపు

శ్రీరాంపూర్‌లో జరగనున్న పార్టీ ర్యాలీకి హాజరయ్యేందుకు కునాల్ ఘోష్ తన వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఉత్తరపారా వద్దకు చేరుకోగానే కొందరు నిరసనకారులు ఆయన కారును అడ్డుకుని 'కునాల్ ఘోష్ గో బ్యాక్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంత‌రం ఒక్కసారిగా రాళ్లు, కోడిగుడ్లతో కారుపై విరుచుకుపడ్డారు. ఈ అకస్మాత్తు దాడిలో కారు వెనుక అద్దం (రియర్ విండ్‌షీల్డ్) తీవ్రంగా ధ్వంసమైంది.

పర్యటన రద్దు.. పోలీసుల గైర్హాజరీపై మండిపాటు

కారు ధ్వంసం కావడంతో కునాల్ ఘోష్ తన శ్రీరాంపూర్ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని తిరిగి కోల్‌కతాకు పయనమయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, ఇది పూర్తిగా అరాచక చర్య అని మండిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ భద్రత కల్పించాల్సిన పోలీసులెవరూ లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన, కోల్‌కతా చేరుకున్నాక దీనిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

టీఎంసీ- బీజేపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు

ఈ దాడి వెనుక భారతీయ జనతా పార్టీ (BJP) హస్తం ఉందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ర్యాలీలకు ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ తక్షణం ఖండించింది. ఉత్తరపారా బీజేపీ ఎమ్మెల్యే దీపాంజన్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ ఘటన వెనుక తమ పార్టీ ప్రమేయం ఏమీలేదని, టీఎంసీ నేతల ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న స్థానిక ప్రజల నుంచి వచ్చిన సహజమైన స్పందన మాత్రమేనని పేర్కొన్నారు. ఈ పరస్పర ఆరోపణలతో హుగ్లీ ప్రాంతంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.