Vande Bharat: ఫ్యామిలీ మెంబర్లను కలిసేందుకు ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యాడు.!

Vande Bharat: కాన్పూర్‌లో బంధువులను సాగనంపేందుకు టికెట్ లేకుండా వందేభారత్ ఎక్కిన 13 మంది, ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో రైల్లోనే చిక్కుకుని రూ.36,140 చెల్లించాల్సి వచ్చింది.

Ravi
By Ravi
Published on: 17 Nov 2026 6:10 PM IST
Vande Bharat
X

Vande Bharat: ఫ్యామిలీ మెంబర్లను కలిసేందుకు ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యాడు.!

Vande Bharat: కాన్పూర్‌లో టికెట్ లేకుండా వందేభారత్ ట్రైన్ ఎక్కిన 13 మందికి అధికారులు షాకిచ్చారు. రైలులో వెళ్తున్న తమ కుటుంబసభ్యులను కలిసేందుకు 13 మంది రైలెక్కారు. ఆటోమేటిక్ డోర్ మూసుకుపోవడంతో బయటకు రాలేకపోయారు. అధికారులు వారి దగ్గర టికెట్లు లేవని గుర్తించి టికెట్ ఫేర్, జరిమానా కలిపి మొత్తం రూ.36,140 వసూలు చేశారు. ప్లాట్‌ఫామ్ టికెట్ కొని ప్లాట్‌ఫామ్ పైకి రావొచ్చు గాని రైలు ఎక్కేందుకు వీల్లేదని స్పష్టంచేశారు.

ఈ ఘటన నవంబర్ 15న (ఆదివారం) కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లో జరిగింది. వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళ్లే 22415 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన తమ బంధువులను సాగనంపేందుకు కొందరు రైలులోకి వెళ్లారు. కొందరు లగేజీ సర్దడానికి కూడా లోపలికి వెళ్లినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. టికెట్ గానీ, ప్లాట్‌ఫామ్ టికెట్ గానీ లేకుండానే రైలు ఎక్కారు. రైలు కదలడానికి ముందే దిగిపోవచ్చని భావించారు.

కానీ వందేభారత్ రైళ్లలో డోర్లు రైలు బయలుదేరే ముందు ఆటోమేటిక్‌గా మూసుకుంటాయి. ఈ విషయం తెలియక, లేదా గమనించక, వారు దిగేలోపే తలుపులు మూసుకుపోయాయి. రైలు కదలడంతో 12 మంది పెద్దలు, ఒక చిన్నారి లోపలే చిక్కుకున్నారు. కొద్దిసేపటికే వారిని ఇటావా జంక్షన్‌లో కిందకు దించారు.

తనిఖీ సమయంలో ఆ 13 మందికి చెల్లుబాటయ్యే టికెట్లు లేవని అధికారులు గుర్తించారు. వీరిని అనధికార ప్రయాణికులుగా పరిగణించి, రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ ఛార్జీ, జరిమానా కలిపి మొత్తం రూ.36,140 వసూలు చేశారు. నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివమ్ శర్మ ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఆయన ప్రకారం, ప్రయాణికుల భద్రత కోసం వందేభారత్ రైళ్లలో డోర్లు ఆటోమేటిక్‌గా మూసుకుపోయేలా వ్యవస్థ ఉంది. కాబట్టి బంధువులను సాగనంపేందుకు రైలులోకి ఎక్కడం ప్రమాదకరం. స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చేవారు కచ్చితంగా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోవాలని రైల్వే శాఖ కోరింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ప్లాట్‌ఫామ్‌పై నిలబడేందుకు మాత్రమే అనుమతిస్తుంది, రైలు ఎక్కేందుకు కాదని స్పష్టం చేసింది.

ప్రయాణికులు, వారిని సాగనంపే వారు రైల్వే నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బంధువులను రైల్లో కూర్చోబెట్టి వారి సీటు వరకు వెళ్లడం సాధారణంగా కనిపించే అలవాటే అయినా, వందేభారత్ వంటి రైళ్లలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. లోపల చిక్కుకుపోతే అనుకోని ప్రయాణం, భారీ జరిమానా తప్పదని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.