Kainchi Dham: కైంచీ ధామ్‌కు వెళ్లేవారికి కొత్త రూల్.. ఇక రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
Kainchi Dham: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కైంచీ ధామ్‌ను దర్శించుకునే భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో నైనితాల్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
Kainchi Dham: కైంచీ ధామ్‌కు వెళ్లేవారికి కొత్త రూల్.. ఇక రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
Kainchi Dham : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కైంచీ ధామ్‌ను దర్శించుకునే భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో నైనితాల్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. నీమ్ కరోలీ బాబా ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్యను నియంత్రించడానికి, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ప్రసిద్ధ 'చార్ ధామ్' యాత్రకు అమల్లో ఉన్న డిజిటల్ నమోదు విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రారంభంలో ఈ విధానాన్ని కేవలం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు (వారాంతాల్లో) మాత్రమే అమలు చేయాలని, తదనంతరం రద్దీ సీజన్లలో పూర్తిస్థాయిలో విస్తరించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు నైనితాల్ జిల్లా మేజిస్ట్రేట్ లలిత్ మోహన్ రాయల్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలిసి సంయుక్త నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖకు సమర్పించనున్నారు. ప్రవేశ పోర్టల్ , సంబంధిత సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేయడానికి ప్రభుత్వానికి సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
చార్ ధామ్ తరహాలో క్యూఆర్ కోడ్ విధానం
ప్రస్తుతం కైంచీ ధామ్ దర్శనానికి ఎలాంటి ముందస్తు అనుమతులు, రిజిస్ట్రేషన్‌లు అవసరం లేదు. నేరుగా వెళ్లే భక్తులు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకుంటున్నారు. అయితే కొత్తగా ప్రతిపాదించిన విధానం ప్రకారం.. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ పోర్టల్ లేదా యాప్ ద్వారా భక్తులు తమ ప్రయాణ వివరాలు, తేదీలు , సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో కూడిన యాత్రా పత్రాన్ని జారీ చేస్తారు. ఆలయం వద్ద నిర్మించే ప్రత్యేక కౌంటర్లలో ఈ వివరాలను సరిచూసిన తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆన్‌లైన్ సదుపాయం లేనివారి కోసం ప్రత్యక్ష రిజిస్ట్రేషన్ కౌంటర్లు, 'యాత్రి మిత్ర' సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఒక రోజులో ఎంతమంది భక్తులు వస్తున్నారనే దానిపై స్పష్టమైన అవగాహన రావడమే కాకుండా, వాహనాల రాకపోకలను సజావుగా నియంత్రించే వెసులుబాటు కలగనుంది.
భారీగా పెరిగిన భక్తులు.. కారణాలు ఇవే
సాధారణ రోజుల్లో కైంచీ ధామ్‌కు రోజుకు సగటున 25,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవలి సుదీర్ఘ వారాంతపు సెలవుల్లో ఈ సంఖ్య రోజుకు 35,000 దాటిపోయింది. దీంతో కైంచీని భోవాలీ, ముక్తేశ్వర్‌లతో కలిపే రహదారిపై తీవ్రస్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు, స్థానికులు గంటల తరబడి నరకయాతన అనుభవించారు. 2025 ఏడాదంతటా కేవలం 8 లక్షల మంది మాత్రమే ఈ క్షేత్రాన్ని దర్శించుకోగా, ఒక్క 2026 ప్రథమార్ధంలోనే ఏకంగా 24.34 లక్షల మంది భక్తులు రావడ విశేషం. వర్షాలు తగ్గడం, నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ' చిత్రం విడుదల కావడం కూడా ఈ స్థాయి భక్తుల రద్దీకి ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.
రూ.21 కోట్లతో ప్రత్యామ్నాయ బైపాస్ రోడ్డు
రద్దీని తట్టుకోవడానికి కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా, మౌలిక వసతుల కల్పనపై కూడా యంత్రాంగం దృష్టి సారించింది. అల్మోరా, రాణిఖేత్, కౌసానీ వైపు వెళ్లే దూరప్రాంత వాహనాలను కైంచీ ధామ్ మార్గంలోకి రాకుండా మళ్లించేందుకు 18 కిలోమీటర్ల 'రతిఘాట్ బైపాస్' నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఇప్పటికే ఇందులో 8 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి కాగా, మిగిలిన 10 కిలోమీటర్ల పనులకు సంబంధించి రూ.21 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయితే రాబోయే నాలుగైదు నెలల్లో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చి, కైంచీ ధామ్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి.




