Justice CS Karnan: ఆరు నెలలు జైలు శిక్ష.. వివాదాల న్యాయమూర్తి ఇక లేరు.!

Justice CS Karnan: భారతీయ న్యాయ చరిత్రలో అత్యంత వివాదాస్పద, సంచలన న్యాయమూర్తిగా పేరుగాంచిన మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ (71) కన్నుమూశారు.

G Krishna
Published on: 13 Nov 2026 8:59 PM IST
Justice CS Karnan
X

Justice CS Karnan: ఆరు నెలలు జైలు శిక్ష.. వివాదాల న్యాయమూర్తి ఇక లేరు.!

Justice CS Karnan: భారతీయ న్యాయ చరిత్రలో అత్యంత వివాదాస్పద, సంచలన న్యాయమూర్తిగా పేరుగాంచిన మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ (71) కన్నుమూశారు. చెన్నైలో నివసిస్తున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 13న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

ఎవరు ఈ సీఎస్ కర్ణన్?

తమిళనాడులోని కడలూరు జిల్లాలో 1955లో జన్మించిన ఆయన అసలు పేరు కరుణానిధి. 1991లో తన భార్య కోరిక మేరకు పేరును కర్ణన్‌గా మార్చుకున్నారు. 1983లో లా పట్టా పుచ్చుకుని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయన, 2009 మార్చిలో మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే తన పదవీకాలం ప్రారంభం నుంచే ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తోటి న్యాయమూర్తులపై కుల వివక్ష, అవినీతి ఆరోపణలు చేయడం, కోర్టు గదిలోనే నిరసనలకు దిగడం వంటి చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచారు.

సుప్రీంకోర్టు జడ్జిలకే శిక్ష విధించి సంచలనం

2016లో మద్రాస్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ అయిన కర్ణన్.. 2017లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించారు. తన బదిలీని వ్యతిరేకించడమే కాకుండా, పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. దీనిని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ కింద ఆయనకు 2017 మే 9న ఆరు నెలల జైలు శిక్ష విధించింది. పదవిలో ఉన్న హైకోర్టు జడ్జికి జైలు శిక్ష పడటం భారత చరిత్రలో ఇదే ప్రథమం.

జైలు జీవితం, రాజకీయ ప్రవేశం

శిక్ష అనుభవించిన అనంతరం 2017 జూన్‌లో పదవీ విరమణ పొందిన కర్ణన్, ఆ తర్వాత కోయంబత్తూరులో అరెస్టై ఆరు నెలలు జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యారు. 2018లో స్వయంగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే 2020 డిసెంబర్‌లో న్యాయమూర్తులు, మహిళా న్యాయాధికారులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నై పోలీసులు ఆయన్ని మళ్లీ అరెస్టు చేశారు. ఆ తర్వాత 2021 మార్చిలో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇలా తన కెరీర్ అంతా వివాదాలు, సంచలన తీర్పులతోనే గడిపిన జస్టిస్ కర్ణన్ మృతి పట్ల పలువురు న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.