CJP: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఆంక్షలు ఉల్లంఘించి నిరసన, సీజేపీ నేతల అరెస్ట్!
CJP: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉల్లంఘించి నిరసనకు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల అరెస్ట్.
CJP: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఆంక్షలు ఉల్లంఘించి నిరసన, సీజేపీ నేతల అరెస్ట్!
CJP: ఢిల్లీలోని చారిత్రాత్మక నిరసన వేదిక జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో జంతర్ మంతర్‌ను ధర్నా వేదికగా డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసులు ఇటీవలే ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు చేపట్టకూడదని పోలీసులు స్పష్టమైన ఆంక్షలు విధించారు. అయితే, ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తూ మంగళవారం నిరసనకు యత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.
నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా, అజింక్య షిండేలను ఢిల్లీ పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "మా ప్రతిఘటనను నిషేధించడం మీ వల్ల సాధ్యం కాదు" అని కామెంట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈ పోస్టులో ట్యాగ్ చేశారు.
ఎన్నికల సంఘం (ECI) తీరును నిరసిస్తూ వివిధ వర్గాల నుంచి ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా జంతర్ మంతర్, ఆర్‌ఎఫ్‌ఐ రోడ్‌లోని ఈసీ (ECI) కార్యాలయం, పార్లమెంట్ హౌస్‌తో పాటు పలు సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను, ఢిల్లీ పోలీసులను భారీగా మోహరించారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




