S Jaishankar: అమెరికా వర్సెస్ చైనా.. జైశంకర్ చెప్పిన కొత్త గేమ్.!

S Jaishankar: ప్రపంచ దౌత్య రంగంలో అమెరికా తన వైఖరిని మార్చుకుంటూ స్వచ్ఛందంగానే "ఒంటరి శక్తిగా" మారిపోతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యాఖ్యానించారు.

G Krishna
Published on: 4 Oct 2026 5:49 PM IST
S Jaishankar
X

S Jaishankar: అమెరికా వర్సెస్ చైనా.. జైశంకర్ చెప్పిన కొత్త గేమ్.!

S Jaishankar: ప్రపంచ దౌత్య రంగంలో అమెరికా తన వైఖరిని మార్చుకుంటూ స్వచ్ఛందంగానే "ఒంటరి శక్తిగా" మారిపోతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యాఖ్యానించారు. జర్మనీలో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో ప్రసంగించిన ఆయన, ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై లోతైన విశ్లేషణ చేశారు. అమెరికా తన స్థానాన్ని పునఃసమీక్షించుకోవడం ఒక ప్రధాన అంశమైతే, చైనా వేగవంతమైన ఎదుగుదల మరొక కీలక అంశమని చెప్పారు. ప్రపంచ తయారీ రంగంలో దాదాపు మూడో వంతు వాటాను కలిగి ఉన్న చైనా, తన ఆర్థిక శక్తిని రాజకీయ ప్రభావంగా మార్చుకుంటోందని తెలిపారు. దీనివల్ల అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని, ప్రతి దేశం తమకున్న పట్టును ఆయుధంగా మలచుకునే పరిస్థితి దాపురించిందని వివరించారు.

మధ్యస్థ శక్తుల ఆత్మనిర్భరత.. 'ఏకీభావం' అక్కర్లేని కొత్త దౌత్యం

ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల్లో అభివృద్ధి చెందుతున్న, మధ్యస్థ శక్తులు (Middle Powers) తమ సొంత ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రాచుర్యం పొందిన 'ఆత్మనిర్భర్' (స్వయం సమృద్ధి) విధాన తరహాలోనే అనేక దేశాలు తమ స్వయం సమృద్ధిని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. ఈ రోజుల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి అన్ని అంశాలపై ఒకే రకమైన అభిప్రాయం (Identity of Views) ఉండాల్సిన అవసరం లేదని, దౌత్యంలో ఆ స్థాయిని ఆశించడం చాలా ఎక్కువని అభిప్రాయపడ్డారు. కొన్ని కీలక అంశాలపై తగినంత స్థాయిలో ఆమోదయోగ్యమైన ఐక్యత లేదా పరస్పర ఒప్పందం (Reasonable Convergence) ఉంటే చాలని, ఆ కొద్దిపాటి పోలికలతోనే వివిధ దేశాలు సమర్థవంతంగా భాగస్వామ్యం కాగలవని స్పష్టం చేశారు.

క్వాడ్, బ్రిక్స్ ప్రాధాన్యం.. మారుతున్న ప్రపంచ వ్యవస్థ

ప్రపంచ దేశాలు తమ ఆర్థిక, భద్రతా ప్రయోజనాల కోసం కొత్త భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఒకవైపు అమెరికా, చైనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, తమ ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సమాఖ్యల్లో భాగస్వాములు కాగలరని ఉదాహరణలతో వివరించారు. ఈ క్రమంలోనే క్వాడ్ (Quad) కూటమితో పాటు బ్రిక్స్ (BRICS) ప్రాధాన్యం పెరుగుతోందని, అనేక దేశాలు తమ ఉమ్మడి గళాన్ని వినిపించేందుకు బ్రిక్స్ వేదికగా ఒక్కటవుతున్నాయని చెప్పారు. ఇవే కాకుండా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC), ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA), అంతర్జాతీయ విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (CDRI) వంటి నూతన వేదికలు ప్రపంచంలో సరికొత్త సహకార సంస్కృతికి అద్దం పడుతున్నాయని జైశంకర్ వెల్లడించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.