Indigo Flight: పాట్నా-లక్నో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 175 మంది ప్రయాణికులు సేఫ్
పాట్నా నుంచి లక్నో వస్తున్న ఇండిగో విమానం ముందు భాగం గాల్లో దెబ్బతింది. 170 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Indigo Flight
Indigo Flight: పాట్నా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి గాల్లో ఊహించని ప్రమాదం ఎదురైంది. విమానం ముందు భాగం (నైస్) తీవ్రంగా దెబ్బతిని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. బోయింగ్ విమానంలో దాదాపు 170 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఏం జరిగింది?
ఇండిగో 6E-925 విమానం పాట్నా నుంచి బయలుదేరి లక్నోలో ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో మేఘాల గుండా వెళ్తున్నప్పుడు విమానాన్ని ఏదో బలంగా తాకినట్లు పైలట్ గమనించారు. విమానంపై పిడుగు పడి ఉండవచ్చని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు ప్రాథమిక సమాచారం అందించారు.
దెబ్బతిన్న ముక్కు భాగం
లక్నో ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సాంకేతిక బృందం పరిశీలించగా విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (DGCA)కు తెలియజేసి, ఆ విమానాన్ని అక్కడే గ్రౌండ్ చేశారు. తదుపరి ప్రయాణమైన అహ్మదాబాద్ ఫ్లైట్‌ను రద్దు చేసి, ప్రయాణికులకు రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమాన సౌకర్యం కల్పించారు.
పక్షి కొట్టిందా? పిడుగు పడిందా?
ఏవియేషన్ నిపుణుల కథనం ప్రకారం గాల్లో విమానాన్ని దెబ్బతీయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మేఘాల్లో ఉండే పెద్ద పరిమాణంలోని మంచు గడ్డలు వేగంగా ఢీకొనడం వల్ల ఇలా జరగవచ్చు. లేదా ఏదైనా పక్షి ఢీకొట్టడం వల్ల కూడా ఫ్రంట్ పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశముంది. పిడుగుపడే అవకాశం కూడా ఉన్నప్పటికీ అది చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
సురక్షితంగా నిలబెట్టిన పైలట్
ప్రమాదం జరిగిన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలట్ ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. విమానానికి సంబంధించిన ఇతర భాగాలపై ఎలాంటి ప్రభావం పడిందో సాంకేతిక బృందం క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. పైలట్ అందించిన నివేదికను డీజీసీఏ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచి సమగ్ర విచారణ జరుపుతున్నారు.




