Indian Space: అంతరిక్షంలో భారత్ దూకుడు.. రూ.లక్షల కోట్ల బిజినెస్‌కు గురి!
Indian Space: ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలంటే ప్రభుత్వ రంగ సంస్థ ఇస్రో మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న విజయాలు.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి.
Indian Space: అంతరిక్షంలో భారత్ దూకుడు.. రూ.లక్షల కోట్ల బిజినెస్‌కు గురి!
India Space: ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలంటే ప్రభుత్వ రంగ సంస్థ ఇస్రో మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న విజయాలు.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి. రాకెట్లు, శాటిలైట్లు, అంతరిక్ష సాంకేతికత.. ఇలా ఒక్కో రంగంలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఈ పరిణామాలతో భారత అంతరిక్ష రంగం భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. 2033 నాటికి దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 44 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది.
ఇస్రో టెక్నాలజీతో కంపెనీలకు కొత్త అవకాశాలు
అంతరిక్ష రంగంలో భారత్ దూకుడుకు టెక్నాలజీ ప్రధాన బలంగా మారుతోంది. మళ్లీ ఉపయోగించుకునే రాకెట్లు, గాలి ఆధారంగా పనిచేసే ప్రొపల్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, అంతరిక్షంలోనే రెండు వ్యోమనౌకలను అనుసంధానం చేసే డాకింగ్ వంటి టెక్నాలజీలు కీలకంగా మారుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంతో పాటు, కొత్త మిషన్లకు దారి తీసే అవకాశం ఉంది.
మరోవైపు, ఇస్రో అభివృద్ధి చేసిన టెక్నాలజీని భారత పరిశ్రమలకు అందించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకుంటున్నాయి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఇప్పటివరకు 83 టెక్నాలజీల బదిలీ కోసం 118 టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందాలు చేసుకుంది. అంటే అంతరిక్ష పరిశోధనల్లో తయారైన పరిజ్ఞానం పరిశ్రమలకు చేరుతోంది. దీని ద్వారా దేశీయ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, సేవలు అభివృద్ధి చేసే అవకాశాలు పెరుగుతున్నాయి.
స్టార్టప్‌లపై ఇన్వెస్టర్ల ఫోకస్
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి భారత స్పేస్ స్టార్టప్‌లలో మొత్తం పెట్టుబడులు సుమారు 618.5 మిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ ఫ్యాక్ట్‌షీట్ వెల్లడించింది. గతంలో ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు చిన్న మొత్తాల్లో నిధులు అందేవి. ఇప్పుడు వ్యాపారాన్ని విస్తరించే దశలో ఉన్న కంపెనీలకు పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు వచ్చే ధోరణి కనిపిస్తోంది.
దీంతో అంతరిక్ష రంగం కేవలం ప్రయోగాలు, పరిశోధనలకే పరిమితం కాకుండా వ్యాపార అవకాశాలకూ కేంద్రంగా మారుతోంది. శాటిలైట్ తయారీ, ప్రయోగ సేవలు, కమ్యూనికేషన్, భూమిని పరిశీలించే డేటా వంటి విభాగాల్లో కంపెనీలకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రంగంలో పెట్టుబడులు, వ్యాపార వృద్ధి ఎంత వేగంగా సాగుతాయన్నది మార్కెట్ అవసరాలు, టెక్నాలజీ అభివృద్ధి, ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.
30 టన్నుల సామర్థ్యంతో కొత్త రాకెట్
భారత్ భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికల్లో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV) కీలకమైనది. 2024 సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ ఈ రాకెట్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.8,240 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. ఇందులో అభివృద్ధి ఖర్చులు, మూడు ప్రయోగాత్మక ప్రయోగాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, కార్యక్రమ నిర్వహణ, లాంచ్ క్యాంపెయిన్ ఖర్చులు ఉన్నాయి.
ఈ రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో గరిష్ఠంగా 30 టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఎల్వీఎం3 సామర్థ్యం సుమారు 10 టన్నుల LEO పేలోడ్‌గా ఉండగా, కొత్త రాకెట్ సామర్థ్యం దానికి మూడు రెట్లు ఉండనుంది. అంతేకాదు, పాక్షికంగా తిరిగి ఉపయోగించుకునే NGLV రూపాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ వెర్షన్ ద్వారా 14 టన్నుల పేలోడ్‌ను LEOలోకి పంపే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
రాకెట్‌లోని కొన్ని భాగాలను తిరిగి ఉపయోగించుకోవడం సాధ్యమైతే ప్రయోగాల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ మిషన్లతో పాటు వాణిజ్య ప్రయోగాలకు కూడా ఉపయోగపడుతుంది. భారీ కమ్యూనికేషన్, భూ పరిశీలన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడం నుంచి భవిష్యత్తు మానవ సహిత మిషన్ల వరకు ఈ రాకెట్ ఉపయోగపడనుంది.
అంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర
అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న మరో కీలక విజయం డాకింగ్ టెక్నాలజీ. SpaDeX మిషన్ ద్వారా కక్ష్యలో రెండు వ్యోమనౌకలను స్వయంచాలకంగా అనుసంధానం చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల నిర్మాణం, క్లిష్టమైన మిషన్ల నిర్వహణకు ఇలాంటి టెక్నాలజీ అవసరం.
భారతీయ అంతరిక్ష కేంద్రం (Bharatiya Antariksh Station) ఏర్పాటు ప్రణాళిక కూడా ఈ ప్రయాణంలో కీలకంగా ఉంది. గగన్‌యాన్ మిషన్ ద్వారా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతోనూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చంద్రుడిపై పరిశోధనలు, ఇతర గ్రహాల అన్వేషణ వంటి మిషన్లకూ కొత్త రాకెట్ టెక్నాలజీలు ఉపయోగపడనున్నాయి.
అంతరిక్షం అంటే రాకెట్లు మాత్రమే కాదు
అంతరిక్ష రంగం అభివృద్ధి అంటే కేవలం రాకెట్లు ప్రయోగించడం మాత్రమే కాదు. మన రోజువారీ జీవితాల్లోనూ శాటిలైట్ల పాత్ర చాలా ఉంది. మారుమూల ప్రాంతాలకు కమ్యూనికేషన్ సదుపాయాలు అందించడంలో కమ్యూనికేషన్ శాటిలైట్లు కీలకంగా పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్, సమాచార సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు కనెక్టివిటీ విస్తరించడంలో ఇవి ఉపయోగపడుతున్నాయి.
భూ పరిశీలన శాటిలైట్ల ద్వారా వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాల అంచనా, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక వంటి రంగాలకు అవసరమైన సమాచారం అందుతోంది. వాతావరణ శాటిలైట్లు తుపాన్లు, రుతుపవనాల కదలికలను గమనిస్తాయి. ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీంతో మత్స్యకారులు, రైతులు, తీర ప్రాంత ప్రజలు తమ జీవనోపాధిని కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలు దేశ భద్రతకు కూడా ఉపయోగపడుతున్నాయి. సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక అవసరాల్లోనూ అంతరిక్ష సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.




