India Invites Pakistan: 18 నెలల తర్వాత పాకిస్థాన్‌కు భారత్ నుంచి పిలుపు

India Invites Pakistan: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య అనూహ్య పరిణామం. ఎస్‌సీఓ సదస్సు కోసం పాక్ మంత్రి ఔరంగజేబ్ ఖాన్‌కు ఢిల్లీ నుంచి ఆహ్వానం.

Arun Chilukuri
Published on: 28 Oct 2026 12:05 PM IST
India Invites Pakistan
X

India Invites Pakistan: 18 నెలల తర్వాత పాకిస్థాన్‌కు భారత్ నుంచి పిలుపు

India Invites Pakistan: పహల్గాం ఉగ్రదాడి, దాని తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’తో ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు ఒక అనూహ్య దౌత్య ఆహ్వానం వెళ్లింది.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న ‘సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్’ సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదిక కానుంది. నవంబర్ 20 నుంచి 22 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు కోసం ఎస్‌సీఓలోని 10 సభ్య దేశాలను భారత్ అధికారికంగా ఆహ్వానించింది.

ఎస్‌సీఓ సదస్సులో భాగంగా పాకిస్థాన్ సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ను భారత్ ఆహ్వానించింది. గతంలో (2023లో) గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల భేటీకి నాటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఇప్పుడు ఔరంగజేబ్ ఖాన్ కనుక ఈ సదస్సుకు వస్తే.. గత మూడేళ్లలో ఒక సీనియర్ పాక్ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది.

ఎస్‌సీఓ ప్రభుత్వాధినేతల మండలి సమావేశం (తజికిస్థాన్)లో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 20నే ఈ సదస్సుపై స్పష్టత ఇచ్చారు. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక, ప్రాచీన నాగరికత సంబంధాలను బలోపేతం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. చైనా, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, కజక్‌స్థాన్‌లతో పాటు తర్వాత చేరిన బెలారస్, భారత్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌లు ఎస్‌సీఓలో సభ్య దేశాలుగా ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.