Bullet Train: గంటకు 280 కి.మీ వేగంతో పరుగులు.. దేశ తొలి మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు విశేషాలు ఇవే!

Bullet Train: భారత్ సొంత సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న తొలి స్వదేశీ బుల్లెట్ రైలు. బెంగళూరు BEMLలో తయారీ, విశేషాలు వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.

Arun Chilukuri
Published on: 3 Nov 2026 11:07 AM IST
Bullet Train
X

Bullet Train: గంటకు 280 కి.మీ వేగంతో పరుగులు.. దేశ తొలి మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు విశేషాలు ఇవే!

Bullet Train: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా భారత్ సొంత సాంకేతికతతో, స్వదేశీ డిజైన్‌తో అత్యాధునిక బుల్లెట్ రైలును కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్టు పురోగతిని తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులోని ప్రముఖ తయారీ కేంద్రమైన బీఈఎమ్ఎల్ (BEML) పరిశ్రమను సందర్శించి పరిశీలించారు.

ప్రస్తుతం నిర్మాణం మరియు స్ట్రక్చరల్ టెస్టింగ్ దశలో ఉన్న ఈ రైలుకు సంబంధించిన ఆసక్తికర గ్లింప్స్‌ను ఆయన 'ఎక్స్' (X) వేదికగా పంచుకోవడంతో దేశవ్యాప్తంగా రైల్వే వర్గాల్లోనూ, ప్రయాణికుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటేలా రూపుదిద్దుకుంటున్న ఈ స్వదేశీ బుల్లెట్ రైలు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రయోగాత్మక పరీక్షల సమయంలో గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా దీన్ని తీర్చిదిద్దుతుండగా, ప్రయాణికులతో నడిచేటప్పుడు గంటకు 249 కిలోమీటర్ల ఆపరేషనల్ స్పీడ్‌తో ప్రయాణించనుంది.

సుమారు 202 మీటర్ల పొడవు ఉండే ఈ రైలు మొత్తం 8 కోచ్‌లతో (4 మోటార్ కార్లు, 4 ట్రైలర్ కార్లు) ఒకేసారి దాదాపు 557 మంది ప్రయాణించే సామర్థ్యంతో వస్తోంది. దివ్యాంగుల (PRM) కోసం ప్రత్యేకంగా రెండు సీట్లను కేటాయించగా, సాధారణ ప్రయాణికుల కోసం 3×2 సీటింగ్ అమరికతో 7 స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, 2×2 సీటింగ్‌తో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రద్దీని బట్టి రెండు 8-కోచ్‌ల రైళ్లను జతచేసి 16-కోచ్‌ల విశాలమైన రైలుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉండటం దీని ప్రత్యేకత.

ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయంగా దీని ఇంటీరియర్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. కాళ్లు ప్రశాంతంగా చాపుకోవడానికి తగినంత లెగ్‌రూమ్, విశాలమైన కిటికీలు, కళ్లకు ఆహ్లాదాన్నిచ్చే ఎల్ఈడీ లైటింగ్, లగేజీ కోసం ఓవర్‌హెడ్ రాక్స్, భారీ బ్యాగుల కోసం ఫ్లోర్‌పై ప్రత్యేక స్టాండ్‌లు, ప్రతి సీటు వద్ద మొబైల్/ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సాకెట్లు కల్పించారు.

ఆధునిక బయో-డిజెస్టర్ టాయిలెట్లు, కోచ్‌ల మధ్య రాకపోకలకు సీల్డ్ గ్యాంగ్‌వే, ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించే ఎల్సీడీ స్క్రీన్లు, ఆడియో ప్రకటనలు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడేందుకు 'ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్లు' ఉన్నాయి. ఫోన్లలో కంటెంట్ చూసుకోవడానికి వీలుగా వైఫై ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను సైతం అందుబాటులోకి తెస్తున్నారు.

అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాట్‌ఫామ్ ఎత్తులోనే రైలు ఫ్లోర్ ఉండేలా డిజైన్ చేయడంతో పాటు, తలుపుల్లో రెట్రాక్టబుల్ స్టెప్స్ అమర్చారు. వీల్‌ఛైర్ వినియోగదారుల కోసం ప్రత్యేక తలుపులు, సీట్లు, టాయిలెట్లు, అంధుల కోసం బ్రెయిలీ లిపి సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఏ వాతావరణంలోనైనా ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ప్రతి కోచ్‌లో రెండు హెచ్‌విఏసి (HVAC) ఏసీ యూనిట్లు పనిచేస్తాయి. సొరంగాలను (టన్నెల్స్) దాటేటప్పుడు వచ్చే భారీ శబ్దాలు (సోనిక్ బూమ్స్) మరియు గాలి నిరోధకతను తట్టుకునేలా కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD) సిమ్యులేషన్స్ ద్వారా ఏరోడైనమిక్ డిజైన్‌తో నోజ్, బాడీ రూపుదిద్దుకున్నాయి.

రైలులో శబ్దాల హోరు తెలియకుండా సౌండ్ ఇన్సులేషన్ మెటీరియల్స్ వాడారు. 25 కెవి ఏసీ ట్రాక్షన్ సిస్టమ్‌పై పనిచేసే ఈ రైలులో, బ్రేక్ వేసిన ప్రతిసారీ విద్యుత్ శక్తిని తిరిగి ఉత్పత్తి చేసే ‘రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్’ను అమర్చడం ద్వారా పర్యావరణ హితమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి ఈ స్వదేశీ బుల్లెట్ రైలు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.