India: భారత్‌కు తీవ్ర స్థాయిలో సైబర్ ముప్పు.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక!

India: ప్రపంచంలో సైబర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉందని మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ నికోలస్ బట్స్ తెలిపారు. చైనా ఏఐ రాన్సమ్‌వేర్ ముప్పుపై హెచ్చరించారు.

G Krishna
Published on: 23 Oct 2026 8:43 PM IST
India
X

India: భారత్‌కు తీవ్ర స్థాయిలో సైబర్ ముప్పు.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక!

India: ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో, ఆసియాలో మూడో స్థానంలో ఉందని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ పాలసీ డైరెక్టర్ నికోలస్ బట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన 'ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2026'లో ఆయన ఈ కీలక విషయాలు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సైబర్ దాడుల తీవ్రత మరింత పెరిగిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతమే ముప్పు ముమ్మరం.. భద్రతా సవాళ్లు వాస్తవం

భారత్‌కు పొంచి ఉన్న సైబర్ ముప్పు భవిష్యత్తులో జరగబోయేది కాదని, ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా సవాలు అని నికోలస్ బట్స్ నొక్కిచెప్పారు. ప్రతిరోజూ 165 ట్రిలియన్ల టెలిమెట్రీ సిగ్నళ్లను విశ్లేషించి, 5 మిలియన్ల కొత్త మాల్‌వేర్‌లను అడ్డుకుంటున్నందునే తమకు ఈ ముప్పుపై స్పష్టమైన అవగాహన ఉందని ఆయన వివరించారు.

చైనా కేంద్రంగా రాన్సమ్‌వేర్ దాడులు.. ఏఐ టూల్స్ దుర్వినియోగం

భారత్‌కు ప్రధానంగా మూడు ముప్పులు పొంచి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. చైనా కేంద్రంగా పనిచేస్తున్న 'స్టార్మ్ 3168' అనే రాన్సమ్‌వేర్ సంస్థ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తూ దాడులకు పాల్పడుతోందని తెలిపారు. అలాగే డేటా దొంగతనం, గూఢచర్యం లక్ష్యంగా చైనా ప్రభుత్వ ప్రేరేపిత 'స్టార్మ్ 0940' సంస్థ కూడా పనిచేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు 'ఈవిల్‌టోకెన్స్' అనే సైబర్ ముఠా ఏఐ టూల్స్‌ను కేవలం 1,500 డాలర్లకే విక్రయిస్తోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో 10,000కు పైగా సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని బట్స్ వెల్లడించారు. ఏఐ సాంకేతికతను నేరగాళ్లు శక్తివంతమైన ఆయుధంగా మారుస్తుండటంతో దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.