Fire Accident : హల్దియా రిఫైనరీలో ఘోర ప్రమాదం.. 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.!

Fire Accident : పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మేదినీపూర్ జిల్లాలో ఉన్న ప్రముఖ 'హల్దియా రిఫైనరీ' (Haldia Refinery) లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం..

G Krishna
Updated on: 30 Jun 2026 10:08 AM IST
Fire-Accident
X

Fire-Accident

Fire Accident : పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మేదినీపూర్ జిల్లాలో ఉన్న ప్రముఖ 'హల్దియా రిఫైనరీ' (Haldia Refinery) లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీలోని నాఫ్తా (Naphtha) పైప్‌లైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన నల్లటి పొగలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.

తెల్లవారుజామున రేగిన మంటలు.. రంగంలోకి 12 ఫైర్ టెండర్లు

అధికారుల సమాచారం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 4:00 నుండి 4:30 గంటల మధ్య సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పైప్‌లైన్‌లో మంటలు వేగంగా వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు 12 ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా.. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వస్తోంది.

క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమం

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, రిఫైనరీ రక్షణ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకుని గాయపడిన 10 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం హల్దియా సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై రిఫైనరీ యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

అత్యంత ప్రమాదకరమైన నాఫ్తా

ముడి చమురు (Crude Oil) శుద్ధి ప్రక్రియలో వచ్చే 'నాఫ్తా' అనేది అత్యంత త్వరగా మండే హై ఫ్లేమబుల్ లిక్విడ్. దీనిని పెట్రోల్, కిరోసిన్ వంటి ఇంధనాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం కావడంతోనే మంటలు అంత వేగంగా వ్యాపించాయని నిపుణులు చెబుతున్నారు.

హల్దియా రిఫైనరీ ప్రాధాన్యత

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కు చెందిన నాలుగో అతిపెద్ద రిఫైనరీగా హల్దియా రిఫైనరీకి గుర్తింపు ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హల్దీ , హుగ్లీ నదులు కలిసే తీర ప్రాంతంలో, కోల్‌కతాకు సుమారు 136 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. 1975లో ప్రారంభమైన ఈ రిఫైనరీ దాదాపు 612 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇంతటి కీలకమైన పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story