రాత్రి నూడుల్స్ తిన్నారు.. ఉదయానికల్లా విగతజీవులుగా మారారు!
Greater Noida: గ్రేటర్ నోయిడాలో విషాదం. రాత్రి నూడుల్స్, టీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఫుడ్ పాయిజనింగ్ అని పోలీసుల అనుమానం.
రాత్రి నూడుల్స్ తిన్నారు.. ఉదయానికల్లా విగతజీవులుగా మారారు!
Greater Noida: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. రబుపుర ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున వీరంతా విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మహేష్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డు (11), మిష్టి (7), సాక్షాత్ (3)లను మృతులుగా పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి చివరగా నూడుల్స్ తిని, టీ తాగినట్లు మహేష్ తల్లి పోలీసులకు తెలిపారు.
ఆహారం వికటించడం (Food Poisoning) వల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరణాలకు అసలు కారణం తెలుసుకునేందుకు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారు తిన్న ఆహార పదార్థాలు, నూడుల్స్, టీ నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు.
కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలోని ముంబయిలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో అబ్దుల్లా డోకాడియా కుటుంబంలోని నలుగురు ఒకరి తర్వాత ఒకరు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.




