Chain Snatching: డెలివరీ బాయ్ వేషంలో వచ్చి.. ఇంటి గుమ్మం వద్దే వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ!

Chain Snatching: ముంబై కాందివలీలో డెలివరీ బాయ్ వేషంలో వచ్చి వృద్ధురాలి గోల్డ్ చైన్ స్నాచింగ్. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్.

Arun Chilukuri
Published on: 6 Nov 2026 3:53 PM IST
Chain Snatching
X

Chain Snatching: డెలివరీ బాయ్ వేషంలో వచ్చి.. ఇంటి గుమ్మం వద్దే వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ!

Chain Snatching: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో అపరిచితులు, కేటుగాళ్లు దొంగతనాల కోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ అమాయక మహిళలు, వృద్ధులే లక్ష్యంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా డెలివరీ ఏజెంట్ వేషంలో వచ్చి ఒక వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దారుణంగా లాక్కెళ్లిన భయానక ఘటన ముంబైలో కలకలం రేపింది.

కాందివలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక నివాస సముదాయంలో నవంబర్ 3వ తేదీ రాత్రి 9:23 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ అపహరణకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్ సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఘటన వివరాలను పరిశీలిస్తే.. సదరు వృద్ధురాలు రాత్రి బయటకు వెళ్లి తిరిగి తన ఫ్లాట్‌కు చేరుకుని ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ప్రముఖ డెలివరీ కంపెనీ ఏజెంట్‌లా దుస్తులు ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, పక్కింట్లో నివసించే వ్యక్తి గురించి అడుగుతూ మాటలు కలిపాడు.

అతడు ఏదో కొరియర్ విషయమై అడుగుతున్నాడని నమ్మి ఆమె సమాధానం చెబుతుండగానే, ఊహించని రీతిలో ఆ దుండగుడు ఒక్కసారిగా వృద్ధురాలిపై విరుచుకుపడ్డాడు. ఆమె మెడలోని రూ. లక్షల విలువైన బంగారు గొలుసును బలంగా లాక్కుని మెట్ల మార్గాన వేగంగా పరారయ్యాడు.

అకస్మాత్తుగా జరిగిన దాడితో సదరు వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కాందివలీ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లోని కెమెరాలను విశ్లేషిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్లు లేదా ఇతర సర్వీస్ సిబ్బంది పేర్లతో వచ్చే అపరిచితుల విషయంలో పౌరులు, ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.