ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు.. ఫారం-6లో మార్పులు
భారత ఎన్నికల సంఘం (ECI) పరిపాలనాపరమైన పారదర్శకతను పెంచేందుకు , ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు
sir-form-6
భారత ఎన్నికల సంఘం (ECI) పరిపాలనాపరమైన పారదర్శకతను పెంచేందుకు , ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా కొత్త ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు ఊరటనిస్తూ, కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా అంతర్గత నిర్వహణ, సమావేశాల నిర్వహణ తీరు , ఐటీ మాడ్యూళ్ల ఆమోద ప్రక్రియలోనూ పలు సంస్కరణలను అమలులోకి తెచ్చింది.
ఫారం-6 నుంచి 'ఎస్ఐఆర్ డిక్లరేషన్' వేరు
కొత్త ఓటరు నమోదు కోసం ఆన్లైన్లో సమర్పించే 'ఫారం 6' (Form 6) నుంచి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) డిక్లరేషన్ను ఈసీ పూర్తిగా వేరు (De-link) చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఈ నిబంధనను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవాలనుకునే వారు ఆన్లైన్లో ఫారం-6 నింపే సమయంలో ఈ డిక్లరేషన్ను జత చేయాల్సిన అవసరం లేదు. దీనిని విడిగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
అంతర్గత నిర్వహణలో సంస్కరణలు.. అధికారుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు
ఎన్నికల సంఘంలో పారదర్శకతను పెంపొందించే దిశగా అంతర్గత విధివిధానాల్లోనూ మార్పులు చేశారు. ఇకపై ఈసీ అధికారుల సమావేశాలకు సంబంధించి స్పష్టమైన విధానాన్ని తెచ్చారు. సమావేశాల అజెండాను ముందుగానే సభ్యులకు అందజేయడం, మీటింగ్ పూర్తయిన తర్వాత అధికారికంగా 'మినిట్స్' (Minutes) జారీ చేయడం తప్పనిసరి చేశారు. గతంలో ఈ పద్ధతి అమలులో ఉండేది కాదు. అలాగే, ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే ముందస్తుగా ఈసీ అనుమతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించారు.
ఐటీ మాడ్యూళ్ల ఆమోదంపై ప్రత్యేక కమిటీ పరిశీలన
కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మోడ్యూళ్ల అభివృద్ధి , ఆమోద ప్రక్రియలో గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) , ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య తలెత్తిన విభేదాలు, వివాదాలకు చెక్ పెడుతూ ఈసీ కీలక మార్పు చేసింది. ఇకపై కొత్త ఐటీ మాడ్యూళ్ల ప్రతిపాదనలను నేరుగా కమిషన్ ముందుకు తీసుకురాకుండా, ముందుగా ఒక ప్రత్యేక కమిటీకి పంపిస్తారు. ఆ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాతే, తుది పరిశీలన కోసం వాటిని ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకువచ్చేలా పకడ్బందీ విధానాన్ని రూపొందించారు.




