Dunkin Donuts: ఇండియాకు డంకిన్ డోనట్స్ గుడ్ బై.. కారణం ఇదే..!

Dunkin Donuts: ప్రముఖ అమెరికన్ బ్రాండ్ డంకిన్ డోనట్స్ భారత మార్కెట్ నుండి తప్పుకోనుంది.

Naresh.k
Published on: 4 April 2026 8:57 AM IST
Dunkin Donuts to Exit India Market by Dec 2026 End of Franchise with Jubilant FoodWorks
X

Dunkin Donuts to Exit India Market by Dec 2026 End of Franchise with Jubilant FoodWorks

Dunkin franchise: అమెరికన్ కాఫీ అండ్ డోనట్స్ దిగ్గజం 'డంకిన్ డోనట్స్' భారతీయులకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రంగురంగుల డోనట్లు, వెరైటీ కాఫీలతో దశాబ్ద కాలానికి పైగా అలరించిన ఈ బ్రాండ్, త్వరలో భారత వీధుల్లో కనుమరుగు కానుంది. ఈ ఏడాది చివరి నాటికి తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడంతో ఫుడ్ లవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఎందుకు ఈ నిర్ణయం? అసలు ఏం జరిగింది?

భారతదేశంలో డంకిన్ డోనట్స్ నేరుగా వ్యాపారం చేయడం లేదు. ప్రముఖ ఆహార దిగ్గజం జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా ఈ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 24, 2011న కుదిరిన ఈ ఒప్పందం, సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత డిసెంబర్ 31, 2026తో ముగియనుంది. అయితే, ఈ ఒప్పందాన్ని మరింత కాలం పొడిగించేందుకు జుబిలెంట్ సంస్థ సుముఖత చూపకపోవడమే ఈ నిష్క్రమణకు ప్రధాన కారణం.

వరుస నష్టాలు..

భారత మార్కెట్‌లో డొమినోస్ పిజ్జాతో తిరుగులేని సక్సెస్ సాధించిన జుబిలెంట్ సంస్థకు, డంకిన్ డోనట్స్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. డోనట్స్ మార్కెట్ భారత్‌లో కొన్ని వర్గాలకే పరిమితం కావడం. ఇటీవలి కాలంలో ఈ విభాగంలో కంపెనీ వరుస నష్టాలను చవిచూడటం. లాభదాయకమైన ఇతర బ్రాండ్లు ,ప్రధాన మార్కెట్లపైనే దృష్టి సారించాలని జుబిలెంట్ నిర్ణయించుకుంది. దీంతో, డంకిన్ బ్రాండ్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు జుబిలెంట్ సంస్థ ఇప్పటికే డంకిన్ డోనట్స్ అంతర్జాతీయ బోర్డుకు అధికారికంగా స్పష్టం చేసింది.

దశలవారీగా స్టోర్ల మూసివేత

ఒకేసారి కాకుండా, 2026 డిసెంబర్ నాటికి దశలవారీగా స్టోర్లను మూసివేయాలని జుబిలెంట్ భావిస్తోంది. నిబంధనల ప్రకారం, కొన్ని నగరాల్లోని స్టోర్లను ఇతర ఆసక్తి గల సంస్థలకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే, కొత్తగా ఏ సంస్థ ముందుకు రాకపోతే 2027 నుండి మన దేశంలో డంకిన్ డోనట్స్ బోర్డులు కనిపించవు.

జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ప్రస్థానం

1995లో ప్రారంభమైన జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, నేడు భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, టర్కీ వంటి దేశాల్లో 3,500 కంటే ఎక్కువ స్టోర్లను నిర్వహిస్తోంది. డొమినోస్ వంటి బ్రాండ్లను ఇంటింటికీ చేర్చిన ఘనత ఈ సంస్థది. డంకిన్ నుండి తప్పుకోవడం ద్వారా కంపెనీ తన రిసోర్స్‌ను మరింత లాభదాయకమైన విభాగాల్లోకి మళ్లించనుంది. గ్లోబల్ బ్రాండ్లు భారత మార్కెట్‌లో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని డంకిన్ డోనట్స్ నిష్క్రమణ మరోసారి నిరూపించింది. ఏదేమైనా, ఒక దశాబ్దానికి పైగా తీపి జ్ఞాపకాలను పంచిన ఈ బ్రాండ్ ఇక జ్ఞాపకంగానే మిగిలిపోనుంది.

Naresh.k

Naresh.k

Next Story