దియా మీర్జా వీడియో డిలీట్.. బీఎంసీపై హైకోర్టు ఫైర్
దీపావళి పండుగ వేళ వెలుగులతో పాటు కాలుష్యం కూడా చుట్టుముడుతున్న వేళ, పర్యావరణ పరిరక్షణ కోసం బీఎంసీ (బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) చేపట్టిన ఒక
Dia Mirza Video Deletion
దీపావళి పండుగ వేళ వెలుగులతో పాటు కాలుష్యం కూడా చుట్టుముడుతున్న వేళ, పర్యావరణ పరిరక్షణ కోసం బీఎంసీ (బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) చేపట్టిన ఒక మంచి ప్రయత్నం అనూహ్యంగా తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలంటూ ప్రముఖ నటి దియా మీర్జాతో రూపొందించిన అవగాహన వీడియోను సోషల్ మీడియా నుంచి బీఎంసీ హఠాత్తుగా తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై బొంబాయి హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజా ప్రయోజనాల కోసం చేసిన ఒక మంచి ప్రచారాన్ని రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్య వ్యాఖ్యల వల్ల పక్కనబెట్టడం సరికాదని విమర్శిస్తూ, ప్రజలలో రాజ్యాంగంపై నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఆ వీడియోను వెంటనే తిరిగి పునరుద్ధరించాలని సూచించింది.
ఈ వివాదానికి అసలు బీజం ముంబై రాజకీయ నాయకుల అభ్యంతరాలతో పడింది. బాణసంచా వల్ల కలిగే తీవ్రమైన వాయు, శబ్ద కాలుష్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీఎంసీ సినీ నటీమణులు దియా మీర్జా, మాధురీ దీక్షిత్, నిషిగంధ వాడ్ , క్రికెటర్ అజింక్య రహానే వంటి ప్రముఖులతో వీడియో సందేశాలను రికార్డు చేయించి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. అయితే, అందులో దియా మీర్జా కనిపించడంపై ముంబై బీజేపీ అధ్యక్షుడు అమీత్ సతమ్, మేయర్ రీతూ తావ్డేలు తీవ్రంగా మండిపడ్డారు. పండుగలను ఎలా జరుపుకోవాలో తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, తమ సంస్కృతీ సాంప్రదాయాలు ఎంతో లోతైనవని అమీత్ సతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు, దియా మీర్జాకు హిందూత్వ వ్యతిరేక రంగు పులిమే ప్రయత్నం చేశారు. దాంతో ఒత్తిడికి తలొగ్గిన బీఎంసీ, ఎటువంటి స్పష్టత ఇవ్వకుండానే దియా మీర్జా వీడియోను మాత్రమే డిలీట్ చేసి, మిగతా ప్రముఖుల వీడియోలను అలాగే ఉంచింది.
ఈ వ్యవహారంపై బొంబాయి హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముంబై మహానగరం ఐక్యత, సోదరభావం అనే మూలస్తంభాలపై నడుస్తుందని, పర్యావరణ పరిరక్షణ లాంటి Solemn (పవిత్రమైన) కార్యక్రమాల్లో రాజకీయ వర్గపోరుకు తావుండకూడదని స్పష్టం చేసింది. సమాజం కోసం ముందడుగు వేసిన ప్రముఖులపై కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలిచివేశాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు నటి దియా మీర్జా కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు; కోర్టు ఆదేశాలు, ప్రజారోగ్యం దృష్ట్యా తాను చేసిన వీడియోపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ, కాలుష్య నివారణ చర్యలను అందరూ ఆహ్వానించాలని గుర్తుచేశారు. ఒకవైపు హిందూ పండుగలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికార పక్షం ఆరోపిస్తుంటే, బీఎంసీ రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనా, పర్యావరణం పరిరక్షించాలన్న ఒక మంచి ఉద్దేశం చివరికి రాజకీయ రంగు పులుముకోవడంపై కోర్టు వ్యక్తం చేసిన అసహనం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.




