Thiruparankundram: సుప్రీంకోర్టు తీర్పు..తిరుపరంకుండ్రం కొండపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు

Thiruparankundram: తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, భద్రత కోసం విచ్చేసిన సీఆర్‌పీఎఫ్ జవాన్లపై భక్తులు పూల వర్షం కురిపించారు.

Gagan kumar
Published on: 28 Nov 2026 11:02 AM IST
Thiruparankundram
X

Thiruparankundram: సుప్రీంకోర్టు తీర్పు..తిరుపరంకుండ్రం కొండపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు

Karthigai Deepam: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపరంకుండ్రం కొండపై భక్తి, దేశభక్తి కలగలిసిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం ‘దీపతూన్’ వద్ద శనివారం కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భద్రతా బాధ్యతలు చేపట్టేందుకు శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లకు స్థానికులు, భక్తులు నీరాజనాలు పలికారు.

నవంబర్ 24న జరగాల్సిన కార్తీక దీపారాధనకు ఆటంకాలు కలగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, శనివారం అర్చకుల సంప్రదింపులతో దీపతూన్ వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. భద్రతా పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్ బలగాలకు అప్పగించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి సీఆర్‌పీఎఫ్ బలగాలు వాహనాల్లో తిరుపరంకుండ్రం చేరుకున్నాయి. ఆలయ సమీపంలోకి జవాన్ల వాహనాలు రాగానే, అప్పటికే అక్కడ వేచి ఉన్న వందలాది మంది భక్తులు, స్థానికులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. భారత్ మాతా కీ జై నినాదాల మధ్య జవాన్ల వాహనాలపై పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. భక్తుల ప్రేమాభిమానాలకు సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తిరుపరంకుండ్రం కొండపై ఉన్న అరుళ్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో పాటు సికందర్ బాదుషా దర్గా, పరిసర ప్రాంతాలను సీఆర్‌పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి.కొండపై ఉన్న దర్గాకు అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరంలో భక్తులు దీపాలు వెలిగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. సికందర్ దర్గా, దాని ప్రాంగణానికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, దర్గాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైతే బారికేడ్లు ఏర్పాటు చేయాలని సీఆర్‌పీఎఫ్, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు, ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. తమిళనాడు సీఎస్, డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్ 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మొత్తంగా, సుప్రీంకోర్టు తీర్పుతో శనివారం తిరుపరంకుండ్రం కొండపై జరగనున్న కార్తీక దీపోత్సవం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూనే, అటు దర్గాకు పూర్తి రక్షణ కల్పిస్తూ శాంతియుత వాతావరణంలో వేడుక జరిగేలా కేంద్ర బలగాలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.