Delhi Protest: నిరసనలు తీవ్రమయ్యే అవకాశం: దిల్లీలో ఈ నెల 20 వరకు కేంద్ర బలగాలను పొడిగించాలని విజ్ఞప్తి

Delhi Protest: ఢిల్లీలో సిజేపి మరియు ప్రతిపక్షాల నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సిఎపిఎఫ్ (CAPF) బలగాల మోహరింపును అక్టోబరు 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 13 Oct 2026 11:42 AM IST
Delhi Protest
X

Delhi Protest: నిరసనలు తీవ్రమయ్యే అవకాశం: దిల్లీలో ఈ నెల 20 వరకు కేంద్ర బలగాలను పొడిగించాలని విజ్ఞప్తి

Delhi Protest: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరియు ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రత పరిరక్షణార్థం కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) మోహరింపును ఈ నెల 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.

రాజధానిలోని ప్రధాన ప్రాంతాల్లో ఆందోళనలు మరింత ఊపందుకునే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఉద్రిక్తతలకు తావులేకుండా ఉండేందుకే గడువు పొడిగింపు కోరినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.

విధుల్లో ఉన్న 273 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాల మోహరింపు గడువు సోమవారంతో ముగిసింది. జంతర్ మంతర్, ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం, పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో నిరసనకారులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ 273 కంపెనీల బలగాల గడువును పొడిగించాలని లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ఢిల్లీలో నిరసనల ఉద్రిక్తతల దృష్ట్యా మొత్తం 301 సీఏపీఎఫ్‌ కంపెనీల మోహరింపునకు గతంలోనే ఆమోదం లభించింది. అక్టోబరు 6న 221 కంపెనీలకు, అక్టోబరు 8న మరో 80 కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో మంజూరైన అదనపు 80 బలగాల్లో 28 కంపెనీలు సోమవారం నాటికి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో (SIR) తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని సిజేపి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ మరియు ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.