Delhi: కోటీశ్వరుడినని నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా వేసిన కేటుగాడు అరెస్ట్!

Delhi: దిల్లీలో సంచలనం సృష్టించిన మోసం. కోటీశ్వరుడినని నమ్మించి, పెళ్లి పేరుతో 20 మంది మహిళా కానిస్టేబుళ్ల నుంచి రూ.24 లక్షలు కాజేసిన కేటుగాడిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 24 Oct 2026 4:17 PM IST
Delhi
X

Delhi: కోటీశ్వరుడినని నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా వేసిన కేటుగాడు అరెస్ట్!

Delhi: దిల్లీలో వెలుగు చూసిన సంచలన మోసం ఇది. సోషల్ మీడియా వేదికగా తాను ఓ పెద్ద వ్యాపారవేత్తనని, కోటీశ్వరుడినని నమ్మించి ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసగించిన ఓ కేటుగాడి ఉదంతం కలకలం రేపింది. పెళ్లి పేరుతో నమ్మించి, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడుల పేరుతో రూ.24 లక్షల వరకు కాజేసిన ఈ నిందితుడిని దిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్రాంత్ తోమర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తాను ప్రముఖ వ్యాపారవేత్తనని ప్రొజెక్ట్ చేసుకునేవాడు. లగ్జరీ కార్లు, ఖరీదైన రెస్టారెంట్లు, విలాసవంతమైన భవనాలతో కూడిన ఫొటోలను పోస్ట్ చేస్తూ యువతులను ఆకర్షించేవాడు. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్‌కు కూడా సోషల్ మీడియాలోనే పరిచయమయ్యాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని అతడు ఆశ చూపాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ తన వద్ద ఉన్న నగదుతో పాటు, ఏకంగా రూ.12 లక్షలు వ్యక్తిగత రుణం (Personal Loan) తీసుకొని మరీ మొత్తం రూ.24 లక్షలను విక్రాంత్‌కు అందజేసింది. ఆ తర్వాత అతడు ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విక్రాంత్ అసలు వ్యాపారవేత్త కాదని, కేవలం విలాసవంతమైన జీవితాన్ని నటిస్తూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడతాడని తేలింది. బాధితులతో డేటింగ్‌కు వెళ్లేందుకు ఏకంగా గంటల కొద్ది లగ్జరీ కార్లను అద్దెకు తీసుకునేవాడని విచారణలో తేలింది.

ఈ ఒక్క మహిళా కానిస్టేబులే కాకుండా, సరిగ్గా ఇదే పద్ధతిలో మరో 19 మంది మహిళా కానిస్టేబుళ్లను కూడా విక్రాంత్ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరందరూ ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడం గమనార్హం. అంతేకాదు, నిందితుడితో సహజీవనం చేస్తున్న మరో మహిళ కూడా కానిస్టేబులే కావడం విశేషం. ఆమె ద్వారానే మిగతా మహిళా కానిస్టేబుళ్ల వివరాలు సేకరించి, వారిని ఒక్కొక్కరుగా లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే పలు మోసాల కేసులు ఉండగా.. ఈ ఏడాది జూన్‌లోనే అతడు బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.