Delhi Crime : నిర్భయ ఘటన తర్వాత మళ్లీ అదే భయం.. ఢిల్లీపై సుప్రీం సీరియస్
దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు వారాలుగా మైనర్లపై జరుగుతున్న వరస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు అత్యంత తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల ప్రాథమిక
దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు వారాలుగా మైనర్లపై జరుగుతున్న వరస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు అత్యంత తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల ప్రాథమిక భద్రతను రక్షించడంలో ఇవి వ్యవస్థాగత వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయని సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులు , ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి జేబీ పార్డీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులను సుమోటోగా స్వీకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన విద్యుత్ దీపాలు, సీసీటీవీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల పార్కులు, బస్సులు వంటి బహిరంగ ప్రదేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా మారడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భయపడకుండా, ఆత్మగౌరవంతో జీవించడం పౌరుల ప్రాథమిక హక్కు అని గుర్తుచేసిన కోర్టు, 2012 నాటి నిర్భయ ఘటనను ఈ రోజు మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాల్సి రావడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు కేవలం సానుభూతి తెలిపితే సరిపోదని, బాధ్యతాయుతమైన కార్యాచరణతో మార్పు చూపించాలని స్పష్టం చేసింది.
రెండు వారాల్లో నాలుగు ఘోరాలు
గత కొన్ని రోజులుగా రాజధాని నగరాన్ని కుదిపేసిన ఘటనల వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 10న స్వరూప్ నగర్‌లో 17 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడు, అతని ముగ్గురు సహచరులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఎనిమిది సార్లు కత్తులతో పొడవడంతో చనిపోయిన ఆ బాలిక మృతదేహాన్ని వీధికుక్కలు తింటుండగా సెప్టెంబర్ 13న పోలీసులు గుర్తించి, ముగ్గురు మైనర్లు సహా నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం సెప్టెంబర్ 14న దేశ్‌బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో ఒక ఆరేళ్ల పసిపాపపై అంకిత్ అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో, సెప్టెంబర్ 17న ఓల్డ్ ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల మక్సూద్ అనే టైలర్, 11 ఏళ్ల చిన్నారి కాళ్లు చేతులు కట్టేసి తన దుకాణంలోనే దారుణానికి పాల్పడ్డాడు. ఇక సెప్టెంబర్ 21న కల్కాజీ ఆలయ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల బాలికను, ఆమె స్నేహితుడిని అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమని నమ్మించి, బాలికను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ కేసులో ఆసిఫ్, హేమంత్, ముకేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కదిలిన యంత్రాంగం - సేఫ్టీ ఆడిట్‌కు ఆదేశం
కల్కాజీ పార్క్ ఘటన తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ స్పందించారు. వారం రోజుల్లోగా నగరంలోని అన్ని పార్కుల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లైటింగ్, సెక్యూరిటీ, పెట్రోలింగ్‌పై దృష్టి సారించడంతో పాటు పార్కుల వద్ద 'పింక్ పోలీస్' బలగాలను మోహరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కదులుతున్న బస్సులోనూ అరాచకం
ఢిల్లీ సరిహద్దుల్లోనూ పరిస్థితి దారుణంగా మారింది. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వస్తున్న 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థినికి వర్షం పడుతుండటంతో లిఫ్ట్ ఇచ్చిన బస్సు డ్రైవర్ కుల్‌దీప్, కండక్టర్ సందీప్‌లు 47 కిలోమీటర్ల ప్రయాణంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని కాశ్మీరీ గేట్ ఐఎస్‌బీటీ వద్ద పడేసి పరారవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. రాజధానిలో వరసగా జరుగుతున్న ఈ ఘోరాలు మహిళలు, విద్యార్థి సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి.




