Delhi High Court: ‘32 ఏళ్ల వ్యక్తి జెన్-జీ ఎలా అవుతారు?’.. విచారణలో దిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!
Delhi High Court: పోలీసు అనుమతి లేకుండా ఆందోళనలు చేపడితే సహించబోమని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల పిటిషన్‌ను కొట్టివేసింది.
Delhi High Court: ‘32 ఏళ్ల వ్యక్తి జెన్-జీ ఎలా అవుతారు?’.. విచారణలో దిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!
Delhi High Court: పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించే నిరసన ప్రదర్శనలపై దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేని ఆందోళనలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
అనుమతులు లేని ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో జాతి వ్యతిరేక శక్తులు ప్రవేశించి విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని న్యాయస్థానం హెచ్చరించింది. "ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనల్లో ఆందోళనకారులు అనేక ప్రాంతాలను అగ్నిగుండంగా మార్చి, దోపిడీలకు పాల్పడడాన్ని చూస్తున్నాం కదా?" అని విచారణ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. ఇటువంటి అవాంఛనీయ ఘటనలను నిరోధించడానికే నిరసనలకు ప్రభుత్వాలు, పోలీసులు ముందస్తు అనుమతులను తప్పనిసరి చేస్తాయని వివరించింది.
ఇప్పటికే జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా కాకుండా డీనోటిఫై చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని పిటిషనర్లను ప్రశ్నించింది. "పోలీసులు రోడ్లపై బారికేడ్లను ఊరికే పెట్టరు, వాటి వెనుక భద్రతా కారణాలు ఉంటాయి. విద్యార్థులు బలప్రయోగం చేసి వాటిని తొలగిస్తే, వారితో పాటు విధ్వంసకర శక్తులు జొరబడే అవకాశం ఉంటుంది" అని వ్యాఖ్యానించింది.
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిటిషనర్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు అశుతోష్ వయస్సు 32 ఏళ్లు కాగా, సౌరవ్ వయస్సు 27 ఏళ్లు అని గమనించిన న్యాయస్థానం.. "32 ఏళ్ల వ్యక్తి ఏమీ జెన్-జీ (Gen Z) కాదు.. 1997 తర్వాత జన్మించిన వారిని మాత్రమే జెన్-జీ అంటారు" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనంతరం సీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.




