Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో ఈ-రిక్షా ఛార్జింగ్.. నలుగురు సజీవ దహనం

ఢిల్లీలోని షహదరా విశ్వాస్ నగర్‌లో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ లేదా స్పార్కింగ్ కారణంగా మంటలు మొదలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

CR Reddy
Published on: 29 Nov 2026 10:41 AM IST
Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో ఈ-రిక్షా ఛార్జింగ్.. నలుగురు సజీవ దహనం
X

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షహదరా పరిధిలోని విశ్వాస్ నగర్‌లో ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ దగ్గరే మంటలు?

విశ్వాస్ నగర్‌లోని 11వ గల్లీలో ఉన్న ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ లేదా స్పార్కింగ్ కారణంగా మంటలు మొదలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ మొదలైన మంటలు వేగంగా ఇంటి మొత్తం వ్యాపించాయి. ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది పూర్తి విచారణ తర్వాత తేలనుంది.

నిద్రలో ఉండగానే నలుగురి మృతి

మంటలు చెలరేగిన సమయంలో ఇంటి మొదటి అంతస్తులో కొందరు నిద్రపోతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు వాటి బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.

పోలీసుల దర్యాప్తు.. డీసీపీ కీలక ప్రకటన

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంట్లో భారీగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. షహదరా డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా ఈ ఘటనలో నలుగురు చనిపోయారని, ఇద్దరు గాయపడ్డారని ధ్రువీకరించారు. ఈ-రిక్షా ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు మొదలై ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఒక రోజు ముందే కరోల్‌బాగ్‌లో మరో అగ్నిప్రమాదం

ఢిల్లీలో శనివారం కూడా మరో అగ్నిప్రమాదం జరిగింది. కరోల్‌బాగ్‌లోని కృష్ణా నగర్ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో మధ్యాహ్నం 1.18 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలతో అక్కడికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు శ్రమించి మధ్యాహ్నం 1.45 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఢిల్లీలో ఆందోళన కలిగిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.