దీపావళి వేళ విషాదం.. చేతిలో బాంబు పేలి పదేళ్ల బాలుడు మృతి
Delhi Diwali accident: దీపావళి పర్వదినం ఆ కుటుంబంలో తీవ్ర విషదాన్ని నింపింది. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగ రోజే ఆ ఇంట తీరని రోదన మిగిలింది.
దీపావళి వేళ విషాదం.. చేతిలో బాంబు పేలి పదేళ్ల బాలుడు మృతి
Delhi Diwali accident: దీపావళి పర్వదినం ఆ కుటుంబంలో తీవ్ర విషదాన్ని నింపింది. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగ రోజే ఆ ఇంట తీరని రోదన మిగిలింది. చేతిలో టపాసు పేలడంతో పదేళ్ల బౌలుడు ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. దీపావళి రోజు రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
చేతిలో పట్టుకున్న 'అనార్' పేలి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పదేళ్ల రిషి అనే బాలుడు తన ఇంటి ముందు దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తున్నాడు. ఆ సమయంలో భూచక్రం లేదా 'అనార్' (పూల కుండీ) లాంటి టపాసును చేతిలో పట్టుకుని అంటించే ప్రయత్నం చేశాడు. క్షణాల వ్యవధిలో ఆ బాంబు అకస్మాత్తుగా చేతిలోనే పేలిపోవడంతో మంటలు నేరుగా బాలుడి ఛాతీకి తాకాయి. ఈ ప్రమాదంపై రిషి అన్నయ్య మాట్లాడుతూ.. "ప్రారంభంలో రిషి తన అమ్మను గట్టిగా అరచి పిలిచాడు. మాకు ఏదో చిన్నపాటి కాలిన గాయమే అయి ఉంటుందని అనుకున్నాం. కానీ కొద్దిసేపటికే వాడు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో వెంటనే మేం అతడిని స్కూటర్‌పైనే ఆసుపత్రికి తరలించాం" అని కన్నీటి పర్యంతమయ్యారు. తామంతా అలాగే టపాసులు కాలుస్తామని, కానీ ఆ క్షణంలో ఏం జరిగిందో తమకు అర్థం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రికి చేరేసరికే ప్రాణాలు కోల్పోయిన బాలుడు
రాత్రి 10:50 గంటల ప్రాంతంలో బాలుడిని ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల నుంచి తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. టపాసు పేలుడు వల్ల తీవ్రమైన కాలిన గాయాలై బాలుడు మరణించినట్లు వెల్లడించారు. మరోవైపు, ఈ దీపావళికి అగ్నిమాపక శాఖకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 281 కాల్స్ రాగా.. అందులో కేవలం టపాసుల వల్ల జరిగిన అగ్నిప్రమాదాలకు సంబంధించినవే 24 ఉన్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. పండుగ సంబరాల్లో పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ఇలాంటి ప్రాణాపాయ సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.




