Abhijeet Dipke: 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక' వెనుక కుట్ర అదే: అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

Abhijeet Dipke: దిల్లీలో ఈనెల 10న జరగనున్న నిరసనలో పాల్గొనవద్దంటూ తమ పార్టీ కార్యకర్తలకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు జారీ చేసి బెదిరిస్తున్నారని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 6 Oct 2026 2:17 PM IST
Abhijeet Dipke
X

Abhijeet Dipke: 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక' వెనుక కుట్ర అదే: అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

Abhijeet Dipke: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న దిల్లీలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం దిల్లీలో నిర్వహించనున్న ఆందోళనల్లో ఎవరూ పాల్గొనవద్దని మహారాష్ట్ర పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

‘‘ఇన్నాళ్లు మహారాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యుత్తమమని, దిల్లీ పోలీసులు వారి నుంచి నేర్చుకోవాలని నేను అనేకసార్లు చెప్పాను. కానీ, జంతర్‌మంతర్‌ వద్ద జరిగే శాంతియుత ఆందోళనలో పాల్గొనవద్దంటూ చంద్రపూర్ పోలీసులు మా పార్టీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడం అత్యంత బాధాకరం’’ అని దీప్కే వాపోయారు.

తమ పార్టీ కార్యకర్తల ప్రయాణ ఖర్చుల గురించి కూడా పోలీసులు ఆరా తీయడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని, అసలు ఆందోళన ప్రారంభం కాకముందే అది హింసాత్మకంగా మారుతుందని పోలీసులు ఎలా అంచనా వేయగలరని నిలదీశారు.

సోషల్‌ మీడియాలో ఎలాంటి హింసాత్మక పోస్టులు పెట్టొద్దని పోలీసులు ఆదేశించారని, తాము మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల గురించే మాట్లాడుతామని.. అవి హింసాత్మకమని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తోన్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ (One Nation, One Election) నినాదం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని దీప్కే ఆరోపించారు. దీని ముసుగులో దేశంలో ‘ఒకే దేశం.. ఒకే రాజకీయ పార్టీ’ అనే నియంతృత్వ విధానాన్ని తీసుకురావడానికి పెద్దఎత్తున కుట్ర జరుగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.