అక్రమాలు జరుగుతున్నాయంటూనే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు?: ప్రతిపక్షాలను నిలదీసిన అభిజీత్ దీప్కే!
Abhijeet Dipke: ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. ఆ ప్రక్రియకు చట్టబద్ధత కల్పించడం ఆపి ఎన్నికలను బహిష్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.
అక్రమాలు జరుగుతున్నాయంటూనే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు?: ప్రతిపక్షాలను నిలదీసిన అభిజీత్ దీప్కే!
Abhijeet Dipke: దేశంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, రిగ్గింగ్ జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. ఇకపై ఎన్నికలను పూర్తిగా బహిష్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'ఓటు చోరీ', 'ఎన్నికల చోరీ' అంటూ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసీ ప్రతిపక్షాలు వాటిలో పాల్గొనడం వల్ల పరోక్షంగా ఆ ఎన్నికలకు చట్టబద్ధత చేకూర్చినట్లవుతుందని దీప్కే అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయనే భ్రమను కలిగించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని విమర్శించారు.
ఎన్నికల్లో పోటీ చేయకపోతే తమ రాజకీయ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే విపక్షాలు బరిలో నిలుస్తున్నాయని, అయితే ఓట్లు దొంగిలిస్తున్నప్పుడు, ఎమ్మెల్యేలు-ఎంపీలను ఫిరాయింపులకు గురిచేస్తున్నప్పుడు, పార్టీలను చీలుస్తున్నప్పుడు ఏ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నిలదీశారు.
దేశంలో జరుగుతున్న ఎన్నికల తంతును ఒక 'ఫిక్స్‌డ్ క్రికెట్ మ్యాచ్'తో ఆయన పోల్చారు. మ్యాచ్‌లో అన్ని క్యాచ్‌లను చేజార్చుకోకుండా కొన్ని పట్టుకుంటూ, చివరి ఓవర్ వరకు ఆటను కొనసాగించినట్లుగానే.. అంతా సవ్యంగా సాగుతోందనే భ్రమను కల్పించడానికి విపక్షాలకు కొన్ని విజయాల రూపంలో బిస్కట్లు వేస్తుంటారని ఎద్దేవా చేశారు.
కేవలం తమకు సంబంధించిన రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగినప్పుడు మాత్రమే స్పందించి, మిగిలిన చోట్ల జరిగే అక్రమాలపై నోరు మెదపకపోవడం సరికాదని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీపై ప్రభావం చూపినా ఎన్నికల అక్రమాలను ప్రతిపక్షాలన్నీ కలిసి ఖండించాలని హితవు పలికారు.
రాజకీయ మనుగడ కంటే ముందు దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, ఎన్నికల సంఘంలో చోటుచేసుకున్న పరిణామాలు, 'సర్' (SIR) వివాదం నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరించిన విషయం తెలిసిందే.




