Sabarimala Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానాల్లో ఇరుముడికి అనుమతి!
Sabarimala Ayyappa Devotees Irumudi In Flight: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. విమానాల్లో ఇరుముడి తీసుకెళ్లేందుకు కేంద్రం మూడో ఏడాది అనుమతించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Sabarimala Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానాల్లో ఇరుముడికి అనుమతి!
Sabarimala Ayyappa Devotees Irumudi In Flight: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయ్యప్ప భక్తులు పవిత్రమైన ఇరుముడిని విమాన క్యాబిన్‌లో తమ వెంట తీసుకెళ్లేందుకు ఈ ఏడాది కూడా అనుమతి కల్పించింది. వరుసగా మూడో ఏడాది ఈ వెసులుబాటును కొనసాగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
వరుసగా మూడో ఏడాది అనుమతి
శబరిమల యాత్రలో ఇరుముడి కట్టుకు ఎంతో ప్రత్యేకత ఉందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇరుముడిని వెంట తీసుకెళ్లడం అయ్యప్ప భక్తులకు శతాబ్దాలుగా వస్తున్న పవిత్ర సంప్రదాయమని తెలిపారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలను గౌరవిస్తూ విమాన క్యాబిన్‌లో ఇరుముడిని తీసుకెళ్లేందుకు వరుసగా మూడో ఏడాది కూడా అనుమతులు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
అధికారులకు కీలక ఆదేశాలు
అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), విమానాశ్రయ నిర్వాహకులకు ఈ మేరకు సూచనలు అందించినట్లు పేర్కొన్నారు.
భక్తులకు మరింత సౌకర్యవంతంగా యాత్ర
ప్రతి ఏడాది మండల, మకరవిళక్కు సీజన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తుంటారు. విమానాల్లో ప్రయాణించే భక్తులు ఇరుముడిని తమతో పాటు క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు ఈ అనుమతి ఉపయోగపడనుంది. దీంతో అయ్యప్ప భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
స్వామివారి పవిత్ర యాత్రకు వెళ్లే భక్తులందరికీ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




