కట్నంగా బ్రెజ్జా కారు ఇవ్వలేదని.. పెళ్లికి వరుడు బ్రేక్.. చివరికి..

Dowry Demand: కట్నంగా బ్రెజ్జా కారు ఇవ్వలేదన్న కారణంతో పెళ్లి వేడుక మధ్యలో వరుడు మాట మార్చుకుని వెనుదిరిగిన ఘటన కలకలం రేపుతోంది.

G Krishna
Published on: 22 Nov 2026 8:24 PM IST
Dowry Demand
X

కట్నంగా బ్రెజ్జా కారు ఇవ్వలేదని.. పెళ్లికి వరుడు బ్రేక్.. చివరికి..

Brezza Car Dowry Demand: కట్నంగా బ్రెజ్జా కారు ఇవ్వలేదన్న కారణంతో పెళ్లి వేడుక మధ్యలో వరుడు మాట మార్చుకుని వెనుదిరిగిన ఘటన కలకలం రేపుతోంది. గాంధీ నగర్‌కు చెందిన వరుడు ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేస్తున్నాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని, 1,200 మందికి భోజనాలు సిద్ధం చేశామని వధువు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతా సిద్ధమైన తర్వాత ఊరేగింపు చివరి నిమిషంలో వెనక్కి వెళ్లిపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి విచారణ మొదలుపెట్టారు.

నిశ్చితార్థం నుంచి కారు గొడవ వరకు

గోహానాలోని గాంధీ నగర్‌కు చెందిన యువకుడికి, సోనిపత్‌లోని రామ్ నగర్‌కు చెందిన యువతికి ఆరు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఎంఏ, జేబీటీ పూర్తి చేసిన ఆ యువతికి, 12వ తరగతి చదివి ఢిల్లీ పోలీసులో ఉద్యోగం చేస్తున్న యువకుడితో నవంబర్ 19న గాంధీ నగర్‌లో ఘనంగా నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. వధువు తండ్రి తొమ్మిది లక్షల రూపాయల విలువైన ఆరా కారును బుక్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ కారును టాక్సీలా వాడుతున్నారని, తనకు బ్రెజ్జా కారు కావాలంటూ వరుడు పట్టుబట్టినట్లు ఆరోపించారు.

ఒక్క రోజు గడువుతో తలెత్తిన ఇబ్బంది

వరుడి డిమాండ్‌కు తలొగ్గి ఆరా కారు బుకింగ్‌ను హడావిడిగా క్యాన్సిల్ చేసుకున్నామని వధువు తరఫు వారు అంటున్నారు. పెళ్లికి ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో వెంటనే బ్రెజ్జా కారు బుక్ చేయడం కుదరలేదని, ఆర్థిక స్థోమతకు మించి ఏర్పాట్లు చేసుకున్నామని వాపోయారు. కారుతో పాటు పెళ్లికొడుకు, అతని తల్లి, సోదరుడు, వదినకు కూడా నగలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

పెళ్లి వేదిక వద్ద ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం

నవంబర్ 20న ముర్తల్ రోడ్‌లోని ఓ గార్డెన్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసి, 1,200 మంది అతిథులకు విందు సిద్ధం చేశారు. పెళ్లి రోజున వరుడు తన తల్లితో కలిసి సాధారణ బట్టల్లో ముందుగా అక్కడికి వచ్చాడని వధువు తండ్రి ఆరోపించారు. తాను అడిగిన బ్రెజ్జా కారు అక్కడ కనిపించకపోవడంతో కోపంతో పెళ్లి జరగకుండానే ఊరేగింపును గోహానాకు తిరిగి తీసుకెళ్లాడని తెలిపారు. ఈ ఘటనపై వధువు తండ్రి ఫిర్యాదు చేయడంతో వరుడు, అతని బంధువులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు ఇరు పక్షాలను విచారణకు పిలిచారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని సమాచారం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.