Railway Track Blast: భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు!
Railway Track Blast: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో భారత్-పాక్ సరిహద్దు సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు. ప్యాసింజర్ రైలు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఘటన, తప్పిన ప్రమాదం.
Railway Track Blast: భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు!
Railway Track Blast: భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజస్థాన్‌లోని శ్రీగంగారామ్ (శ్రీగంగానగర్) జిల్లా పరిధిలో ఉన్న 50 జీబీ పాయింట్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే లైన్లో రాత్రి వేళ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో రైల్వే ట్రాక్‌కు ఆధారంగా ఉండే రెండు కాంక్రీట్ పిల్లర్లు, రైల్వే స్లీపర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ధాటికి ట్రాక్ కింద ఏకంగా రెండు అడుగుల లోతు గుంత ఏర్పడింది. 200 మీటర్ల దూరంలో ఉన్న నివాస ప్రాంతాల వరకు ఈ శబ్దం తీవ్రంగా వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అనూప్‌గఢ్ జంక్షన్ నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు ఈ ట్రాక్ గుండా ప్రయాణించిన కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుడు జరగడం విశేషం. రైలు వెళ్లిన వెంటనే పేలుడు సంభవించడంతో ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే రక్షణ దళం (RPF), రాజస్థాన్ పోలీసులతో పాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), కౌంటర్ ఇంటెలిజెన్స్ (CID), బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మరియు ఫొరెన్సిక్ (FSL) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇటీవల భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శ్రీగంగానగర్ సమీపంలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన 7.5 కేజీల ఆర్డీఎక్స్ (RDX) సహా భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే మంగళవారం రాత్రి జరిగిన ఈ రైల్వే ట్రాక్ పేలుడుకు, ఆర్డీఎక్స్ రికవరీకి ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుని కుట్రపన్నారా? అనే పలు అనుమానాస్పద కోణాల్లో ఆర్మీ మరియు ఏటీఎస్ బలగాలు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నాయి. బాంబు డిస్పోజల్ బృందాలు సేకరించిన నమూనాల ఆధారంగా ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు వెల్లడిస్తామని శ్రీగంగానగర్ ఎస్పీ హరిశంకర్ వెల్లడించారు.




