BJP SIR Campaign: ఓటర్ లిస్ట్ సవరణ ప్రక్రియపై బీజేపీ మెగా ప్లాన్..  ప్రజల్లోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు

BJP SIR Campaign: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలకు చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

CR Reddy
Published on: 16 Oct 2026 6:25 AM IST
BJP SIR Campaign:
X

BJP SIR Campaign:

BJP SIR Campaign: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలకు చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కచ్చితమైన వివరాలు, పత్రాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా వచ్చే వారం నుంచి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, సవరణ ప్రక్రియలకు సంబంధించిన నిజాలను సవివరంగా వివరించనున్నారు.

24 పేజీల ప్రత్యేక నివేదిక సిద్ధం

ఈ ప్రచారం కోసం బీజేపీ 24 పేజీలతో కూడిన ఒక నివేదికను ప్రత్యేకంగా రూపొందించింది. విపక్షాలు చెప్తున్న "13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారు" అనే ప్రతిపాదనలోని అసత్యాలను ఈ నివేదిక ఆధారంగా ఎండగట్టనున్నారు. డ్రాఫ్ట్ రోల్‌లో ASDD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో పేర్లను గుర్తించడానికి, ఆఖరి జాబితా నుంచి తొలగించడానికి మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా వివరించనున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల జాబితాను నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా మార్చడం కోసమే ఈ ప్రక్రియ అని స్పష్టం చేయనున్నారు.

ఫామ్-6, ఈసీఐ నెట్ అంశాలపై స్పష్టత

ఫామ్-6 లో ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడానికి డిక్లరేషన్ ఫామ్‌ను దీనికి జోడించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల నమోదు అధికారి (ERO) చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే ఓటర్ల పేర్లను చేర్చడం లేదా తొలగించడం జరుగుతుందని, రాష్ట్రాల వారీగా ఈ డేటాబేస్ సురక్షితంగా నిర్వహించబడుతుందని వివరించనున్నారు. దీనికి తోడు 2.37 కోట్ల మంది జెన్-జీ కొత్త ఓటర్లు ఓటర్ల జాబితాలో చేరిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్‌ను తమ ప్రచారంలో చేర్చనున్నారు.

రాహుల్ గాంధీపై సంబిత్ పాత్ర ఘాటు విమర్శలు

ఈ అంశంపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మరియు వారి మిత్రపక్షాల అసలు ఉద్దేశం ఓటర్ల సమస్యలపై పోరాడటం కాదని, ఎలాగైనా అధికారంలోకి రావడమే వారి ఏకైక లక్ష్యమని విమర్శించారు. ప్రజలు వరుసగా తిరస్కరిస్తున్నప్పటికీ, కష్టపడకుండా అధికారాన్ని దక్కించుకోవడానికి నిత్యం ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.