Bittu Tabahi: మరో నదిని శుభ్రం చేసిన బిట్టూ తబాహి.. యమునా నదిలో ఏకంగా 585 కేజీల చెత్త తొలగింపు!
Bittu Tabahi: మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు బిట్టూ తబాహి దిల్లీలోని యమునా నదిని శుభ్రం చేశాడు.
Bittu Tabahi: మరో నదిని శుభ్రం చేసిన బిట్టూ తబాహి.. యమునా నదిలో ఏకంగా 585 కేజీల చెత్త తొలగింపు!
Bittu Tabahi: దేశ రాజధాని దిల్లీలోని యమునా నది ప్రక్షాళన కోసం మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు నడుం బిగించారు. మధ్యప్రదేశ్‌లో అజ్నార్ నదిని శుభ్రం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌధరీ (బిట్టూ తబాహి).. తాజాగా దిల్లీలోని యమునా నదిలో శ్రమిచారు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం దాదాపు 5 గంటల పాటు కష్టపడి నదిలో నుంచి ఏకంగా 585 కేజీల వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లి బహిరంగ ప్రదేశాలు, నదుల శుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు బిట్టూ తబాహి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, రానున్న రోజుల్లో ఈ స్వచ్ఛతా కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌధరీ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. స్థానికంగా ఉన్న అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికికూలంగా మారుతుండటాన్ని ఆయన చూసి చలించిపోయారు. అసలు ఈత రాకపోయినా, చేతికి గ్లౌజ్‌లు, కనీసం బూట్లు కూడా లేకపోయినా మొక్కవోని దీక్షతో కొన్ని నెలలపాటు శ్రమించి ఆ నదిని పూర్తిగా శుభ్రం చేశారు.
ఈ సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అంకితభావానికి నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ (The Ocean Cleanup) నుంచి ఏకంగా ఉద్యోగ ఆఫర్ రావడం విశేషం. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిట్టూ తబాహి ప్రస్తుతం యువతకు అసలైన రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.




