Supreme Court: బిల్కిస్ బానో కేసులో కీలక మలుపు.. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్

Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 16 Nov 2026 3:54 PM IST
Supreme Court
X

Supreme Court: బిల్కిస్ బానో కేసులో కీలక మలుపు.. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్

Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులు బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ శిక్షను ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ, వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఈ కేసులో తమకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సమర్థిస్తూ 2017లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ శిక్షను నిలిపివేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. నిందితులు బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని, అంతేకాకుండా వారిలో ఒకరు తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని పేర్కొంది. వారి అరెస్టుకు దారితీసిన పరిస్థితులు, సుదీర్ఘ జైలు శిక్షను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరగడంతో పాటు, ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సత్ప్రవర్తన కారణం చూపుతూ 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులోని 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది. వారిలో బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ కూడా ఉన్నారు.

దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో బాధితురాలితో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. క్షమాభిక్ష ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తేల్చిచెబుతూ 2024 జనవరిలో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో 11 మంది దోషులు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా వీరిలో ఇద్దరికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.