Road Accident: ప్రీ వెడ్డింగుకు వెళ్లి వస్తుండగా నదిలో పడిన స్కార్పియో.. ఆరుగురి మృతి

బీహార్‌లోని అరారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిలక్ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ఏడుగురు ప్రయాణిస్తున్న స్కార్పియో బీడీ వంతెనపై నుంచి మరియా నదిలో పడిపోయింది.

CR Reddy
Published on: 19 Nov 2026 7:56 AM IST
Bihar Road Accident
X

Bihar Road Accident

Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రీ వెడ్డింగులో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. పెళ్లి వేడుకలో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణమైన కుటుంబంలో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. బుధవారం అర్ధరాత్రి అరారియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తిలక్ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

బీహార్‌లోని అరారియా జిల్లా తారాబాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో మదన్‌పూర్‌-సిక్టీ రహదారిపై ఉన్న బీడీ వంతెన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సుపౌల్ జిల్లాలోని పిప్రా ప్రాంతానికి చెందిన ఏడుగురు సిక్టీ బ్లాక్‌లోని భపటియాహి గ్రామంలో జరిగిన తిలక్ వేడుకకు వెళ్లారు. వేడుక ముగిసిన తర్వాత భోజనం చేసి స్కార్పియోలో తిరిగి సొంత ప్రాంతానికి బయలుదేరారు. రాత్రి సుమారు 11.45 గంటల సమయంలో వంతెన దగ్గరకు చేరుకోగానే వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.

50 అడుగుల లోతులో నదిలోకి దూసుకెళ్లిన కారు

బీడీ వంతెన దగ్గర ఉన్న మలుపు ప్రమాదకరంగా ఉండటంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. దీంతో స్కార్పియో వంతెన పక్కన ఉన్న రక్షణ కంచెను ఢీకొట్టి, దాన్ని బద్దలుకొడుతూ కింద ఉన్న మరియా నదిలో పడిపోయింది. సుమారు 50 అడుగుల లోతులోకి కారు పడటంతో అందులో ఉన్నవారు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. వాహనంలోకి నీరు చేరడం, బయటకు వచ్చే మార్గం లేకపోవడం వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

పోలీసుల సహాయంతో బయటకు తీసిన స్కార్పియో

ప్రమాద శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు ప్రారంభించారు. వాహనాన్ని తాళ్లతో కట్టి, జేసీబీ సాయంతో నది నుంచి బయటకు తీశారు. కారులో ఉన్న ఏడుగురినీ బయటకు తీసి అరారియా సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆరుగురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తికి చికిత్స అందించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పాట్నాకు తరలించినట్లు సమాచారం.

ఆరుగురి మృతితో గ్రామంలో విషాదం

ఈ ప్రమాదంలో మరణించిన వారిని సుపౌల్ జిల్లాలోని తుమ్హా గ్రామానికి చెందిన కుందన్ యాదవ్ (28), ఆర్యన్ (15), మున్నా కుమార్ (22), ఆదిత్య (20), సౌరభ్ (15), యశ్ కుమార్ (16)గా గుర్తించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. వీరంతా తిలక్ వేడుకకు వెళ్లిన వధువు తరఫు కుటుంబ సభ్యులుగా సమాచారం. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. పెళ్లి వేడుకతో సందడిగా ఉన్న కుటుంబాల్లో ఈ ప్రమాదం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.