Mamata Banerjee: మమతా బెనర్జీకి భారీ ఊరట.. రెబల్ ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రెబల్ నేత రితబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.

Arun Chilukuri
Published on: 27 Nov 2026 5:46 PM IST
Mamata Banerjee
X

Mamata Banerjee: మమతా బెనర్జీకి భారీ ఊరట.. రెబల్ ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్!

Mamata Banerjee: టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో రాజకీయంగా ఇబ్బందుల్లో పడిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో భారీ ఊరట లభించింది. బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ నేత రితబ్రత బెనర్జీ నియామకాన్ని శుక్రవారం హైకోర్టు రద్దు చేసింది. అలాగే, పార్టీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే అక్రుజమాన్ నియామకాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది.

ప్రతిపక్ష నేత నియామకంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం అస్థిరంగా ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై మమతా బెనర్జీ వర్గం వాదనలను మరోసారి పరిశీలించాలని స్పీకర్ రతీంద్ర బోస్‌ను ఆదేశించింది. అనంతరం 10 రోజుల్లోగా కొత్త ప్రతిపక్ష నేత నియామకంపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మమతా బెనర్జీ వర్గానికి ఊరట లభించినట్లయింది.

ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమి చవిచూసింది. మొత్తం 294 స్థానాల్లో ఆ పార్టీ 80 సీట్లకే పరిమితమైంది. మమతా బెనర్జీ కూడా ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. అసెంబ్లీలో తమ పార్టీ పక్ష నేతగా శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్‌ను ఎన్నుకోవాలని మమత నిర్ణయించారు.

అయితే, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రితబ్రత బెనర్జీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో రితబ్రత మరో 58 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. అసలైన టీఎంసీ తమదేనని పేర్కొంటూ రెబల్స్ వర్గం రితబ్రతను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోగా, దానికి స్పీకర్ ఆమోదం తెలిపారు.

రితబ్రత నియామకాన్ని సవాల్ చేస్తూ శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తూ శాసనసభా పక్ష సమావేశంలో చేసిన తీర్మానంపై రితబ్రత కూడా సంతకం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తొలుత సింగిల్ బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించగా, డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఆగస్టులో విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. రితబ్రత నియామకాన్ని తాత్కాలికంగా కొనసాగించేందుకు అనుమతిస్తూ, తిరిగి విచారించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌కు సూచించింది. ఈ క్రమంలో తాజా విచారణ అనంతరం హైకోర్టు మమతా బెనర్జీ వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.