Amit Shah: ‘సర్‌’ లేనప్పుడూ ఓడారు.. 2029లోనూ కాంగ్రెస్‌కు పరాజయం ఖాయం: అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు!

Amit Shah: ఓటర్ల జాబితాల సవరణ 'సర్‌' వివాదంపై స్పందించిన అమిత్ షా. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌కు 2029లోనూ ఓటమి ఖాయమని ఎద్దేవా, జైరాం రమేశ్ కౌంటర్.

Arun Chilukuri
Published on: 14 Oct 2026 10:57 AM IST
Amit Shah
X

Amit Shah: ‘సర్‌’ లేనప్పుడూ ఓడారు.. 2029లోనూ కాంగ్రెస్‌కు పరాజయం ఖాయం: అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు!

Amit Shah: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) వివాదం మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తొలిసారిగా ఘాటుగా స్పందించారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ వరుస ఓటములను మూటగట్టుకుంటోందని, తమ ఓటమి వైఫల్యాలను ‘సర్‌’ (SIR) పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.

ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (సర్‌) 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రారంభమైందని, కానీ దానికి ముందు కూడా కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో ఓడిపోయిందని అమిత్ షా గుర్తుచేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయే (NDA) బ్రహ్మాండమైన ఆధిక్యంతో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌ పార్టీ వరుసగా నాలుగోసారి ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ కాంగ్రెస్‌కు ఓటమే ఎదురవుతోందని, ఓటములపై ఆత్మవిమర్శ చేసుకోకుండా మీడియా పబ్లిసిటీ కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చొరబాటుదారులను ఓటర్లుగా చేర్చాలనే ఆలోచనలతో ఉన్న రాహుల్ గాంధీ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని షా ఆరోపించారు.

కాంగ్రెస్‌కు ఒకప్పటి కంచుకోట అయిన గుజరాత్‌లో గత 41 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఎందుకు గెలవలేకపోతోందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

"ఢిల్లీలో 14 రాజకీయ పార్టీలకు చెందిన 8 వేల మంది కార్యకర్తలు రోడ్డుపైకి గుమిగూడినంత మాత్రాన అది దేశం తరఫున రాహుల్ వినిపించిన వాణి కాజాలదు. ప్రజల మనోభావాలు తెలుసుకోవాలంటే పొలాలు, గ్రామాలు, కొండకోనలకు వెళ్లాలి. కానీ రాహుల్ అక్కడకు వెళ్లలేరు." అని షా తెలిపారు.

అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిస్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ.. "ఓటు చోరీకి సహ రూపకర్తగా ఉన్న అమిత్ షా, అప్పుడే రిగ్గింగు ప్రక్రియను ప్రారంభించారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికే దేశ యువత ఇప్పుడు రోడ్లపైకి వస్తోంది" అని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.