Amit Shah: రాహుల్ జీవితంలో ప్రధాని కాలేరు!
Amit Shah: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , ఇండియా (INDIA) కూటమి లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Amit Shah: రాహుల్ జీవితంలో ప్రధాని కాలేరు!
Amit Shah: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , ఇండియా (INDIA) కూటమి లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లు ప్రారంభమైన నవంబర్ 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ చేపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కు సమాజపు ఆవేదనను, వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని, అల్లర్ల బాధితుల గాయాలపై ఉప్పు చల్లేలా ఈ ర్యాలీ ఉందోని మండిపడ్డారు.
1984 సిక్కుల ఊచకోత కాంగ్రెస్ ప్రేరేపితమే: అమిత్ షా ధ్వజం
చండీగఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా 1984 నాటి దారుణాలను గుర్తుచేశారు. నవంబర్ 1, 1984న దేశంలో ప్రారంభమైన హింసాకాండలో వేలాది మంది అమాయక సిక్కులు దారుణంగా ప్రాణాలు కోల్పోయారని, ఈ అల్లర్లను కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ప్రేరేపించిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. వేలాది మంది సజీవ దహనమయ్యారని, వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని, ఎంతో మంది చిన్నారులు అనాథలుగా, మహిళలు వితంతువులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ "పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కంపిస్తుంది" అంటూ ఆనాటి వినాశనాన్ని తక్కువ చేసి మాట్లాడారని, బాధితుల పట్ల కాంగ్రెస్‌కు ఏనాడూ సున్నితత్వం లేదని విమర్శించారు. కనీసం నవంబర్ 1, 2, 3 తేదీల్లో ర్యాలీలు నిర్వహించవద్దని బీజేపీ కోరినప్పటికీ కాంగ్రెస్ పట్టించుకోలేదని తెలిపారు.
విదేశీ ఆదేశాలు.. రూ.25,000 కోట్ల వ్యాపారానికి గండి
విదేశాల నుంచి వచ్చే ఆదేశాలు, సిఫార్సుల మేరకే నవంబర్ 1న ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని అమిత్ షా సంచలన ఆరోపణ చేశారు. దీపావళి పండుగ వేళ ఢిల్లీలో సుమారు రూ.25,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, ఈ సమయంలో ర్యాలీలు పెట్టి వ్యాపారాలను దెబ్బతీయవద్దని స్థానిక వ్యాపారులు మొరపెట్టుకున్నా ఇండియా కూటమి ఖాతరు చేయలేదని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల కోసం పండుగ సీజన్‌లో వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
రాహుల్‌కు ప్రధాని పీఠం దక్కదు.. షా ఘాటు సెటైర్లు
ఎన్నికల్లో వరుస పరాజయాలను చవిచూస్తున్న రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన తల్లి సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని, అందుకోసమే విపక్షాలు 'మాక్ పార్లమెంట్'ల పేరుతో కొత్త నాటకాలకు తెరలేపాయని షా ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి నేరుగా కౌంటర్ ఇస్తూ.. "రాహుల్ జీ.. మీరు ప్రధానమంత్రి కావాలని అనుకుంటే జీవితాంతం ఆ మాక్ పార్లమెంట్‌లోనే ప్రధానిగా ఉండిపోండి. ఎందుకంటే నిజ జీవితంలో మీ వంతు ఎప్పటికీ రాదు" అంటూ అమిత్ షా ఘాటుగా సెటైర్లు వేశారు.




