Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్.. దమ్ముంటే పార్లమెంట్‌కు రండి!
Amit Shah: ప్రధాని మోదీతో బహిరంగ చర్చ డిమాండ్‌పై రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్. పార్లమెంట్‌లో తేల్చుకుందామంటూ హరియాణా పాదయాత్రలో ఘాటు వ్యాఖ్యలు.
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్.. దమ్ముంటే పార్లమెంట్‌కు రండి!
Amit Shah: జాతీయ రాజకీయాల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండటంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ చర్చలను వీధుల్లో కాకుండా పార్లమెంట్ వేదికగా జరపాలని రాహుల్ గాంధీకి ఆయన విసిరారు. ప్రభుత్వం నుంచి వచ్చే పక్కా ఆధారాలు, సమాధానాలను రాహుల్ గాంధీ తట్టుకోలేకే పార్లమెంట్ నుంచి పారిపోతుంటారని ఎద్దేవా చేశారు.
హరియాణాలోని కర్నాల్ వేదికగా బీజేపీ నిర్వహించిన ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హఠావో’ పాదయాత్రలో పాల్గొన్న అమిత్ షా, ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. మీకు నిజంగా బాధ్యతాయుతమైన చర్చ జరగాలని ఉంటే, మీ ఆందోళనల్లో సత్యం, తర్కం ఉంటే పార్లమెంట్‌కు వచ్చి ఎదురెదురుగా కూర్చొని చర్చించాలని సవాల్ చేశారు.
ప్రతిపక్ష హోదాలో ఉండి పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, బాయ్‌కాట్‌లను రాజకీయ వ్యూహంగా మార్చుకుంటూ కీలకమైన చర్చలను తప్పించుకోవడానికి వీధుల్లో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.
దేశాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలు విదేశీ శక్తుల సాయం తీసుకుంటున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ బహిరంగ చర్చను డిమాండ్ చేస్తున్నారు. దీనికి సమాధానంగా, వీధుల్లో జనాలను సమీకరిస్తూ సభను అడ్డుకోవాలని చూస్తే బీజేపీ నుంచి గట్టి సమాధానం వస్తుందని అమిత్ షా హెచ్చరించారు. లోక్‌సభలో తాను మాట్లాడకుండా మైక్ కట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించడాన్ని కొట్టిపారేస్తూ, పార్లమెంట్‌లో ఏ అంశంపైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.




