Kochi: డాక్టర్‌కు షాకిచ్చిన నటీనటులు.. ఫ్లాట్‌కు పిలిచి..
Kochi: అత్యవసర వైద్యం పేరిట డాక్టర్‌ను రప్పించి రూ.3.5 లక్షల దోపిడీ. నటి అతుల్య చంద్ర, బిబిన్ పెరుంబిల్లి అరెస్ట్ పూర్తి వివరాలు.
Kochi: డాక్టర్‌కు షాకిచ్చిన నటీనటులు.. ఫ్లాట్‌కు పిలిచి..
Kochi: అత్యవసర వైద్య సాయం కావాలంటూ ఒక డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిపించుకుని, ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘోర ఘటన కేరళలోని కొచ్చిలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు.
కొచ్చిలోని ఎసెన్ స్ప్రింగ్‌డేల్ అపార్ట్మెంట్ నుంచి నటి అతుల్య చంద్ర, నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లిలు స్థానిక వైద్యుడికి ఫోన్ చేశారు. తమ బంధువు ఒకరికి తీవ్ర ఆరోగ్య సమస్య వచ్చిందని, అత్యవసరంగా వచ్చి వైద్యసాయం అందించాలని అభ్యర్థించారు.
నటీనటుల మాటలు నమ్మిన సదరు వైద్యుడు ఉదయం 6:30 గంటల సమయంలో వారి ఫ్లాట్‌కు చేరుకున్నారు. తీరా లోపలికి వెళ్లేసరికి అక్కడ నటీనటులతో పాటు సుమారు 12 మంది యువతీ యువకులు గుమిగూడి ఉన్నారు. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టిన వెంటనే వారంతా ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేశారు.
అనంతరం ఆయన వద్ద ఉన్న ఐఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్లెస్ ఇయర్ఫోన్ల వంటి సుమారు రూ. 3.5 లక్షల విలువైన విలువైన వస్తువులను బలవంతంగా గుంజుకున్నారు. ఈ అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, చికిత్స పేరిట వచ్చి తమ బంధువుపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తప్పుడు కేసులు పెట్టి కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారు.
బాధితుడు కొన్ని గంటల పాటు నరకం చూసి, వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితులైన నటి అతుల్య చంద్ర, నటుడు బిబిన్ పెరుంబిల్లితో పాటు మరొకరిని వెంటనే అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న మిగిలిన తొమ్మిది మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అసలు కేవలం దోపిడీ కోసమే డాక్టర్‌ను ప్లాన్ ప్రకారం రప్పించారా లేక దీని వెనుక ఏదైనా ఇతర హనీట్రాప్ లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.




