Abhijeet Dipke: పోస్టులు తొలగించినా ప్రజల ప్రశ్నలు ఆగవు!
Abhijeet Dipke: కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు, ఖాతాలను తొలగిస్తోందన్న ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే విమర్శలు చేశారు.
Abhijeet Dipke: పోస్టులు తొలగించినా ప్రజల ప్రశ్నలు ఆగవు!
Abhijeet Dipke: కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు, ఖాతాలను తొలగిస్తోందన్న ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నలు అడిగే వారి ఖాతాలను తొలగించినంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు.
‘ఖాతాలు తొలగిస్తే ప్రశ్నలు ఆగవు’
బుధవారం ఎక్స్ (X) వేదికగా స్పందించిన అభిజీత్ డిప్కే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ తొలగింపుతో సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు అడుగుతున్నారని, ఆ ప్రశ్నలకు కారణమైన నిరుద్యోగం, పాలన, మౌలిక సదుపాయాల వంటి సమస్యలు సోషల్ మీడియాకు బయట కూడా ఉన్నాయని అన్నారు. ఖాతాలను తొలగించడం వల్ల ప్రజల ఆందోళనలు మాయమవ్వవని, ఇలాంటి చర్యలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఖాతాల నిలిపివేతపై కోర్టులో పిటిషన్
సోషల్ మీడియా కంటెంట్‌పై ఆంక్షలు, భావప్రకటనా స్వేచ్ఛపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. యువత నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీకులు, ప్రభుత్వ పనితీరు, ప్రజా మౌలిక సదుపాయాలపై ప్రశ్నలు లేవనెత్తే పోస్టులు, ఖాతాలను పరిమితం చేయాలని కేంద్రం సోషల్ మీడియా సంస్థలను కోరినట్లు PTI నివేదించింది.
ఇదిలా ఉండగా, ‘Bring Back Ballot’ ఉద్యమానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా భారత్‌లో అందుబాటులో లేకుండా చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అక్టోబర్ 27న ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన జరిగిన రోజే ఆ ఖాతాను నిలిపివేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వివరణ లేదా ఆదేశాల ప్రతిని తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నవంబర్ 6న జరగనుంది. అప్పటికి కేంద్రం తన సమాధానాన్ని సమర్పించే అవకాశం ఉంది.




