Puri Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో దారుణం.. ఐదుగురు అరెస్ట్
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో సులభ దర్శనం పేరుతో 13 మంది ఎన్నారైలను మోసం చేసిన ఐదుగురు నకిలీ గైడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Puri Jagannath Temple: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో భక్తులను మోసం చేస్తున్న నకిలీ గైడ్ల ముఠా గుట్టు రట్టయింది. సులభంగా దర్శనం చేయిస్తామని నమ్మించి 13 మంది ప్రవాస భారతీయులను (NRIs) వేధించి, డబ్బులు కాజేసిన కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం ఒక బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో వెంటనే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సోమవారం మరో నలుగురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ఐదు నిమిషాల్లో వస్తామంటూ రూ.13 వేలతో పరార్
ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. 13 మంది సభ్యులున్న ఎన్నారై బృందంలోని ఒక మహిళ తమకు జరిగిన చేదు అనుభవాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది. ఆలయం బయట ఉన్న చెప్పుల స్టాండ్ సమీపంలో కొందరు వ్యక్తులు తమను తాము ఆలయ గైడ్లుగా పరిచయం చేసుకున్నారని ఆమె తెలిపింది. సులభ దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చి, బృందంలోని 13 మంది నుంచి తలా రూ.1,000 చొప్పున మొత్తం రూ.13,000 వసూలు చేశారని వివరించింది. డబ్బులు తీసుకున్న తర్వాత ఐదు నిమిషాలు అక్కడే వేచి ఉండాలని చెప్పి, ఆ నకిలీ గైడ్లు జనసందోహంలో కలిసి మాయమైపోయారని వాపోయింది.
భక్తులతో దురుసు ప్రవర్తన
స్థానికంగా గుమాస్తాలుగా పిలుచుకునే ఈ నకిలీ గైడ్లు బయటి నుంచి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజుతున్నారు. నిజానికి శ్రీ బలభద్రుడు, దేవి సుభద్ర, జగన్నాథ స్వామి దర్శనానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన సంస్థ (SJTA) ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా ఈ మోసగాళ్లు భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు. తమ సేవలు వద్దని చెప్పిన లేదా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన భక్తులను వీరు బూతులు తిడుతూ బెదిరించేవారని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు
ఎన్నారైలు మోసానికి గురైనప్పటికీ ఆలయ ప్రవేశ ద్వారం వద్దే ఉన్న పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను సింహద్వార్ పోలీస్ స్టేషన్ అధికారులు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 22, 23 తేదీల్లో రెండు కేసులు నమోదు చేసి, ఐదుగురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. నిందితుల వద్ద నుంచి రూ.7,110 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ గైడ్ల మాయలో పడొద్దని ఎస్పీ విజ్ఞప్తి
ఈ ఘటన నేపథ్యంలో పూరీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆలయ గైడ్లమని చెప్పుకునే అనధికార వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఎవరైనా దర్శనం పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా, ఇబ్బంది పెట్టినా వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.




