Suryapet: నాగార్జున సాగర్ నీటిని తరలించే కుట్రలను తిప్పికొడతాం!

Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 19 Nov 2026 12:58 PM IST
Suryapet
X

Suryapet: నాగార్జున సాగర్ నీటిని తరలించే కుట్రలను తిప్పికొడతాం!

Suryapet: కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు చెందాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించేందుకు జరిగిన కుట్రలను తిప్పికొడతామని, ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీ ప్రయత్నాలను అడ్డుకున్నామని వెల్లడించారు.

గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, కొత్త పెన్షన్లు అందిస్తున్న శుభ సందర్భంలో హుజూర్‌నగర్ ప్రజల మధ్యకు రావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 38,115 పెన్షన్లు అందిస్తుండగా, తాజాగా మరో 5 వేల పెన్షన్లు మంజూరు చేసి మొత్తం 43 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు నుంచి కొత్తగా ఇందిరా జీవిత బీమా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారు ఉంటే వారికి కూడా మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వారం రోజుల్లో చేపడతామని, డిసెంబర్ రెండో వారంలో ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇంకా అర్హులైన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కరవు పరిస్థితుల్లో తాగునీటి అవసరాల కోసం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసుకుంటున్నామని, నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

బీఆర్‌ఎస్ నాయకులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి పాలనలోనే కృష్ణా, గోదావరి జలాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. వారు నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి మిగులు జలాలను ఎక్కువగా వినియోగించుకున్నది తెలంగాణేనని, అత్యధిక పంటలు పండించిన ఘనత కూడా మనదేనని పేర్కొన్నారు.

మిలటరీలో పనిచేసిన అనుభవంతో తనకు అప్పగించిన శాఖాపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నానని మంత్రి తెలిపారు. ప్రజలందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR