Suryapet: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకే నిరంతర పోరాటం!
Suryapet: సూర్యాపేటలో టీజేఎస్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్‌కు ఘన సన్మానం.
Suryapet: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకే నిరంతర పోరాటం!
Suryapet: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు, భారత రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేస్తానని, ఎన్నికల్లో కూడా పోటీ చేసి చట్టసభల్లో ఆ లక్ష్యంగా పనిచేస్తానని తెలంగాణ జన సమితి రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు కుంట్ల ధర్మార్జున్ ప్రకటించారు.
రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహావీర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని శత్రుదాడులను, పోలీసు నిర్బంధాన్ని తట్టుకొని నిలబడ్డానని, జయశంకర్ సార్, కోదండరాం సార్ మార్గదర్శకత్వంలో సుదీర్ఘ కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పనిచేశానని తెలిపారు.
తెలంగాణ సాధన కోసం మీటింగులు పెడుతుంటే అడ్డుకున్న వాళ్లే, అవహేళన చేసిన వాళ్లే ఈరోజు అధికార ఆర్భాటం అనుభవిస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో యువతను సమీకరించుటకు హ్యాండ్ మైకును సైకిల్, మోటారుకు కట్టుకొని నియోజకవర్గమంతా గ్రామ గ్రామాన మీటింగులు పెట్టామని, పాదయాత్రలు నిర్వహించామని గుర్తు చేశారు.
గత పదేళ్ల టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి పోరాటం నిర్వహించిందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో గానీ, కేసీఆర్ వ్యతిరేక ఉద్యమంలో గానీ అడ్రస్ లేని వాళ్లంతా నేడు అధికారం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2028 ఎన్నికల్లో తెలంగాణ జన సమితి సూర్యాపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తుందని, గెలిచి తీరుతుందని ధర్మార్జున్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గట్ల రమా శంకర్ అధ్యక్షత వహించారు. కార్యకర్తలను నిరంతరం అంటిపెట్టుకొని ఉండే ధర్మార్జున్ నాయకత్వంలో పనిచేయడం ధైర్యాన్నిస్తుందని ఆయన అన్నారు. యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ధనబలంతో వచ్చే జనబలం నిలబడదని, ప్రజా పోరాటాల ద్వారానే జనబలాన్ని నిర్మించుకోవచ్చని, దానికి నిదర్శనమే ధర్మార్జున్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కొంచెం చంద్రకాంత్, రైతు జన సమితి జిల్లా అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి గోపి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సమితి నాయకులు ధర్మార్జున్‌ను శాలువాలతో సత్కరించారు.




