Suryapet: సూర్యాపేట జిల్లాలో కలకలం, రూ. 12 కోట్లతో ఉపాధ్యాయుడు పరారీ!
Suryapet: సూర్యాపేట జిల్లాలో చీటీలు, అధిక వడ్డీ ఆశ చూపి రూ. 12 కోట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరారీ. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు.
Suryapet: సూర్యాపేట జిల్లాలో కలకలం, రూ. 12 కోట్లతో ఉపాధ్యాయుడు పరారీ!
Suryapet: చీటీల పేరుతో, అధిక వడ్డీ ఆశ చూపి సొంత బంధువులు, సహోద్యోగుల దగ్గర 10 నుండి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరారైన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది.
చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాకు చెందిన భానోత్ రాజు ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం, 12 ఎకరాల పొలం, నెలకు రూ.2.5 నుండి 3 లక్షల ఆదాయం ఉందని, సొంత బంధువు కావడంతో తండా వాసులు అతన్ని నమ్మారు. 2010 నుండి డైలీ చిట్టీలు నడుపుతూ బ్యాంకు తరహాలో నమ్మకం సంపాదించాడు.
ఈ నమ్మకంతోనే అమాయకుల పేర్ల మీద భారీగా లోన్లు ఇప్పించాడు. హుస్సేన్ అనే బాధితుడి ద్వారా 65 లక్షల లోన్ తీసుకోవడంతో పాటు, మరో రెండు చోట్ల 50 లక్షలు, 40 లక్షలకు షూరిటీ పెట్టించి ఆ ఒక్క కుటుంబంపైనే కోటిన్నర భారం మోపాడు. బానోతు నాగు కుటుంబం నుంచి కోటి 13 లక్షలు, నెమ్మికల్ కు చెందిన అంతయ్య అనే టీచర్ పేరు మీద 5-6 బ్యాంకుల్లో కోటి 70 లక్షల పర్సనల్ లోన్ తీసుకొని ఆ ఇళ్లను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
తండాలో 15-20 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 20 లక్షల నుంచి కోటి వరకు, మొత్తంగా 8 నుంచి 12 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రైతు కూలీలు, వృద్ధులు అని కూడా చూడకుండా డబ్బులు తీసుకున్నాడని, ఇన్నాళ్లు EMIలు తానే కడుతూ వచ్చి ఈ నెల మొదట్లో ఫోన్ స్విచాఫ్ చేసి పరారయ్యాడని బాధితులు వాపోతున్నారు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు తమ ఇళ్లపై ఒత్తిడి తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులుగా కనిపించకుండా పోయిన రాజు ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల సంఖ్య 40-60 మంది వరకు ఉంటుందని, నల్లగొండ, ఆత్మకూర్, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో మోసం చేశాడని లక్ష్మీనాయక్ తండా సర్పంచ్ తెలిపారు.
బాధితులు జిల్లా ఎస్పీ నరసింహను కలిసి వినతిపత్రం అందజేయగా, చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న రాజు ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.




