Nalgonda: నరకాసుర వేషధారణలో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన
Nalgonda: గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై నల్లగొండ వీధుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ నరకాసుర వేషధారణలో వినూత్న అవగాహన కల్పించారు.
Nalgonda: నరకాసుర వేషధారణలో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన
నల్లగొండ: గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జానపద కళారూపాన్ని ఆయుధంగా మలచుకుని నరకాసుర వేషధారణలో నల్లగొండ నగరంలోని ప్రధాన కూడళ్లలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జెడ్‌పిహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ సమాజ హితం కోసం ఈ వినూత్న బాట పట్టారు. నల్లగొండ నగరంలోని ప్రధాన కూడళ్లలో నరకాసుర వేషధారణలో తిరుగుతూ గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
నడిరోడ్డుపై గంభీరమైన ఆహార్యం, కత్తి చేతబట్టి గర్జిస్తున్న నరకాసురుడిని చూసి మొదట జనం ఆశ్చర్యపోయినా, ఆయన చెప్పిన సందేశం విని ఆలోచనలో పడ్డారు.
“ద్వాపర యుగంలో నన్ను అధర్మపరుడన్నారు, రాక్షసుడన్నారు. కానీ ఈనాటి గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల రూపంలో పొంచి ఉన్న మహమ్మారుల కంటే నేనేమీ రాక్షసుడిని కాదు. నా వేషం వెనక ఉన్న ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని నాశనం చేస్తున్న నిజమైన నరకాసురుల పట్ల అప్రమత్తం చేయడమే. మత్తు బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటారా? ఇకనైనా మేల్కొనండి, సే నో టు డ్రగ్స్. అలాగే రోడ్డుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం మీ బాధ్యత కాదా? నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోండి” అని ఆయన పిలుపునిచ్చారు.
ఓవైపు మరుగున పడిపోతున్న జానపద కళారూపానికి ప్రాణం పోస్తూనే, మరోవైపు ఆధునిక సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై, రోడ్డు ప్రమాదాలపై పోరాటం చేయడం విశేషం. పౌరులంతా విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాచీన పౌరాణిక పాత్ర ద్వారా సామాజిక రుగ్మతలపై సమరం ప్రకటించిన ఉపాధ్యాయుడు ప్రభాకర్ ప్రయత్నాన్ని స్థానిక ప్రజలు, అధికారులు ప్రశంసించారు.




