Suryapet: సూర్యాపేటను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతాం కలెక్టర్!

Suryapet: సూర్యాపేటను బాలల స్నేహపూర్వక జిల్లాగా మార్చేందుకు కలెక్టరేట్‌లో యూనిసెఫ్‌తో ఒప్పందం. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ హాజరు.

PULUSU NAGARAJU, SURYAPETA
Updated on: 30 Oct 2026 6:47 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతాం కలెక్టర్!

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తున్నది. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి స్వేచ్ఛ, అభిరుచులు, ఆలోచనా విధానంపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులు, విద్యాశాఖ క్లస్టర్, గ్రామస్థాయి రిసోర్స్ పర్సన్లు, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పిల్లల హక్కులు, మానసిక వికాసం, వారి ఆలోచనా సరళి, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అధికారి పిల్లల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాలలు తమ హక్కులను, స్వేచ్ఛను పూర్తిస్థాయిలో అనుభవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పిల్లల్లోని నైపుణ్యాలు, అభిరుచులను గుర్తించి, వారు స్వచ్ఛందంగా తమ ప్రతిభను ప్రదర్శించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ శిక్షణ సూర్యాపేటను ఆదర్శ బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి ఫిలిప్స్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనుష, జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. రవికుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఉపేంద్ర, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA