Suryapet: శ్రావణ్ మృతి కేసు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

Suryapet: సూర్యాపేట శ్రావణ్ మృతి చెంది 16 రోజులు గడిచినా నివేదికలు ఇవ్వలేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లంబాడి విద్యార్థి సేన డిమాండ్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 31 Oct 2026 7:17 PM IST
Suryapet
X

Suryapet: శ్రావణ్ మృతి కేసు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

సూర్యాపేట: చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి 16 రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని వంకుడోతు శ్రావణ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి గల అసలు కారణాలు ఇప్పటికీ తెలియకపోవడం, పోస్టుమార్టం, సీడీఆర్, ఫోరెన్సిక్ నివేదికలపై స్పష్టత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. భల్లా తండాకు చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్ మాట్లాడుతూ శ్రవణ్ మృతి చెంది 16 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం, సీడీఆర్, ఫోరెన్సిక్ నివేదికలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నివేదికలు సిద్ధంగా ఉంటే చట్టపరమైన విధానంలో బాధిత కుటుంబానికి అందించాలని, పెండింగ్‌లో ఉంటే ఆలస్యానికి గల కారణాలను, నివేదికలు ఎప్పటిలోగా వస్తాయో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.

విచారణ పురోగతిపై పోలీసులను ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం ఇవ్వకపోగా, అవమానకరంగా మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ కేసును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు లంబాడి విద్యార్థి సేన పోరాటం కొనసాగిస్తుందని వీరన్న నాయక్ స్పష్టం చేశారు. నివేదికలు అందించడంలో జాప్యం కొనసాగితే, విచారణలో పురోగతి కనిపించకపోతే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సూర్యాపేట ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు హరీష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రవి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ శివ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ సుమన్ నాయక్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ, చివ్వెంల మండల అధ్యక్షులు రమేష్ నాయక్, నాయకులు భూక్యా చంటి నాయక్, మోతె మండలం మాజీ సర్పంచ్ బాలాజీ, భల్లా తండాకు చెందిన వెంకన్న నాయక్, రమేష్, వంకుడోత్ గాంధీ, భల్లా తండా సర్పంచ్ భూక్య మల్సూర్, మృతుడి బావ సపావత్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA