Suryapet: కారుణ్య నియామకంలో చేతివాటం.. ఉద్యోగి సస్పెన్షన్!
Suryapet: సూర్యాపేట ఆర్‌అండ్‌బీ శాఖలో కారుణ్య నియామకం లంచం బాగోతం జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ కుమార్ సస్పెన్షన్ ఉన్నత స్థాయి విచారణకు కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశం.
Suryapet: కారుణ్య నియామకంలో చేతివాటం.. ఉద్యోగి సస్పెన్షన్!
సూర్యాపేట: రోడ్లు, భవనాల శాఖలో కారుణ్య నియామకం పేరిట బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసి, వేరొకరికి అడ్డదారిలో పోస్టింగ్ కట్టబెట్టిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్ అండ్ బి శాఖలో వాచ్ మెన్ గా పని చేస్తూ 2023లో గుండెపోటుతో మృతి చెందిన మండపల్లి భరత్ బాబు కొడుకుకు కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇవ్వడానికి జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ కుమార్ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంత పెద్ద మొత్తం చెల్లించుకోలేక బాధితుడు ఏళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతుండగా ఆ పోస్టింగ్ ను తొక్కిపెట్టారు. అదే సమయంలో డిమాండ్ చేసిన మొత్తాన్ని సమర్పించిన వేరొక అభ్యర్థికి పోస్టింగ్ కట్టబెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించడంతో సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించిన కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ కుమార్ ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహారంలో కేవలం జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నాడా లేక వెనుక పెద్దల హస్తం ఉందా అనే కోణంలో లోతైన దర్యాప్తునకు కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఆర్ అండ్ బి సూపరింటెండింగ్ ఇంజినీర్, ఆడిట్ ఆఫీసర్ లతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.




